– అభివృద్ధి, సంక్షేమంపై ప్రభావం
– ఇప్పటికే రాజ్యసభ పూర్తి
– లోక్‌సభకు పోటాపోటీ
– ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలకు కూడా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఈ సంవత్సరం అత్యధిక కాలం కొనసాగనుంది. పలు రకాల ఎన్నికలే ఇందుకు దోహదం చేస్తున్నాయి. లోక్‌సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఈ ఏడాదిలో ఎన్నికలు జరగ నున్నాయి. ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. కాంగ్రెస్ రెండు, బీఆర్‌ఎస్ ఒక స్థానాన్ని ఎమ్మెల్యేల కోటాలో గెలుచుకున్న సంగతి తెలిసిందే. సంతోష్‌కుమార్, వి.రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ స్థానంలో రవిచంద్ర తిరిగి ఎన్నిక కాగా, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ కొత్తగా ఎన్నికయ్యారు. అలాగే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎన్నిక సైతం జరిగింది. ఫలితం ఇంకా ప్రకటించలేదు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఆ తర్వాత ఈ స్థానం ఫలితాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అక్కడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీనిపై కూడా ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. ఈనేపథ్యంలో 2024 సంవత్సరంలో ఎన్నికల కోడ్ అత్యధిక కాలం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ఆరు నెలలకుపైగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా మే 13న పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోడ్ జూన్ ఆరు వరకు అమల్లో ఉండనుంది. అలాగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్న సంగతీ తెలిసిందే. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి జనగామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు చేపట్టారు. ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఎన్నికయ్యారు. హైకోర్టులో కేసు పడటంతో ఆ ఎన్నికల ఫలితాలను ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సైతం కీలకం కానుంది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ)కు జూన్ ఆరుతో పదవీకాలం ముగియనుంది. వాటికీ ఎన్నికలు చేపట్టాలి. ఇప్పటికే ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసిన సర్పంచుల స్థానాల్లో ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చిన విషయం విదితమే. 2019, జనవరిలో పంచాయతీలకు, 2019 మే లో జిల్లా పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.2018లో తొలిసారిగా ఏర్పాటైన 4000 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే.మొత్తంగా 12,751 పంచాయతీలు, 538 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈమేరకు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు ఈఎన్నికల నిర్వహణ కోసం సన్నాహాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు వీటి నిర్వహణ కోసం శిక్షణ కార్యక్రమాలు సైతం ఇప్పటికే ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్న తరుణంలో రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈనెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సంగతి తెలిసిందే. వరుస ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎన్నికల కోడ్ ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.