– జెండాల పైపులు విద్యుత్ వైర్లకు తగిలి..
– ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
– మెదక్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి తరలింపు
నవతెలంగాణ-హవేలీఘనపూర్
మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో జరగనున్న ఉమ్మడి జిల్లా క్రీడా పోటీల ఏర్పాట్లలో జెండాలను గుంతలో పాతే క్రమంలో జెండా ఇనుప పైపులు విద్యుత్ వైర్లకు తగిలి ఐదుగురు విద్యార్థులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికల గురుకుల పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన క్రీడా పోటీలను నేడు(బుధవారం) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తుండగా.. జెండాలు గుంతలో పాతే క్రమంలో ఇనుపపైపు పాఠశాల ముందు నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లకు తాకింది. దాంతో గురుకుల పాఠశాలకు చెందిన రజిత, తనుష్క, గాయత్రి, వసంత, బాలుర పాఠశాలకు చెందిన వర్షిత్ అనే ఐదుగురు విద్యార్థులు విద్యుద్ఘాతానికి గురై స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన పాఠశాల సిబ్బంది ఆ విద్యార్థులను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వారిని ఇంటికి తీసుకెళ్లారు. మెదక్ ఆర్డీవో రమాదేవి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా విద్యార్థులతో పనిచేయించడం పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.