విద్యుత్‌ విధ్వంసం

– పదేండ్లలో నిర్మించింది ఒక్క ప్రాజెక్టే
– దానికీ అంచనాలు పెంచి ఆలస్యంగా పూర్తిచేశారు
– వడ్డీలు చెల్లించేందుకూ అప్పులు చేశారు
– క్రమశిక్షణ లేకుండా భవిష్యత్‌ను పణంగా పెట్టారు
– ‘విద్యుత్‌ శాఖ శ్వేతపత్రం’పై చర్చను ప్రారంభిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పదేండ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ విధ్వంసం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసి, లఘు చర్చను ప్రారంభించారు. ప్రజల నాణ్యమైన జీవన శైలిని విద్యుత్‌ సూచిస్తుందనీ, ఆర్థికంగా, నిర్వహణా పరంగా విద్యుత్‌ రంగం పరిపుష్టంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి టీఎస్‌ జెన్‌కోలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు కాగా, రాష్ట్ర ఏర్పాటుకంటే ముందే తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి తమ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఈ కొత్త విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలే తరువాతి కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడి స్థాపిత ఉత్పత్తి సామర్ధ్యానికి అదనంగా 1,800 మెగావాట్ల విద్యుత్‌ వచ్చే విధంగా అప్పటి తమ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు మాత్రమేనని తెలిపారు, ఇది కూడా పూర్తి కావడానికి సుదీర్ఘ కాలం పట్టిందనీ, ప్రమాణాలకు విరుద్ధంగా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ఉపయోగించడంతో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగిందని వివరించారు. బొగ్గు గనులకు అత్యంత దూరంగా నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూపకల్పన చేసిందనీ, ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా కోసం అదనపు ఖర్చే సంవత్సరానికి రూ 800 కోట్లు అవుతుందని తెలిపారు.
ప్రాజెక్టు జీవితకాలం 30 ఏండ్లు అనుకుంటే, ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకరంగా ఉందన్నారు. డిస్కంలు రూ 62,461 కోట్ల నష్టాల్లోకి వెళ్లాయనీ, 2023 అక్టోబర్‌ 31 విద్యుత్‌ సంస్థల మొత్తం అప్పు రూ.81,516 కోట్లకు చేరిందని వివరించారు. వీటిలో రూ. 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం అనీ, ఇవి కాకుండా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ. 28,673 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందని విశ్లేషించారు. విద్యుత్‌ కొనుగోళ్లలో డిస్కంలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం ప్రభుత్వ శాఖలు ఏండ్ల తరబడి కరెంటు బిల్లులు చెల్లించకపోవడం కూడా ఓ కారణమని అన్నారు. ప్రభుత్వ శాఖల కరెంటు బిల్లుల బకాయిలు రూ. 28,842 కోట్లు ఉన్నాయన్నారు.
వీటిలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సిన సొమ్మే రూ. 14,193 కోట్లు ఉందని చెప్పారు. ఇవి కాకుండా విద్యుత్‌ కొనుగోళ్ళ వాస్తవ సర్దుబాటు ఖర్చులు (ట్రూ అప్‌) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని హామీ ఇచ్చి, మాట తప్పిన సొమ్ము అక్షరాలా రూ. 14,928 కోట్లు ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అలివికాని అప్పులు చేయాల్సిన దుస్థితికి వెళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్లే ఇప్పుడు డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయని వివరించారు. గత ప్రభుత్వం తమ ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్‌ సంస్థల ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించేందుకే శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇవీ పదేండ్ల కరెంటు లెక్కలు
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో విద్యుత్‌రంగంపై
ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని వివరాలు (2014 నుంచి 2023 అక్టోబర్‌ వరకు)
– విద్యుత్‌ సంస్థల మొత్తం అప్పులు – రూ.81,516 కోట్లు
– కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించేందుకు తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం – రూ. 30,406 కోట్లు
– విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు – రూ.28,673 కోట్లు
– డిస్కంల నష్టాలు – రూ.62,461 కోట్లు
– ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు – రూ.28,842 కోట్లు
– దీనిలో సాగునీటి శాఖ బకాయిలు – రూ.14,193 కోట్లు
– మిషన్‌ భగీరథ బకాయిలు – రూ.3,558.83 కోట్లు
– పంచాయితీరాజ్‌ శాఖ బకాయిలు – రూ.4,393.99 కోట్లు
– వాటర్‌బోర్డు చెల్లించాల్సిన బకాయిలు – రూ. 3,932.47 కోట్లు
– మున్సిపాల్టీల బకాయిలు – రూ.1,657.81 కోట్లు
– కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు – రూ. 720 కోట్లు
– ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తామని చెప్పి, ఇప్పటికీ ఇవ్వని విద్యుత్‌ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చులు (ట్రూఅప్‌) – రూ. 14,928 కోట్లు
– ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన ఇంథన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌సీఏ) – రూ.2,378 కోట్లు
– సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు – రూ.19,431 కోట్లు
– తొమ్మిదిన్నరేండ్లలో స్వల్పకాలిక మార్కెట్ల నుంచి కొన్న కరెంటు – 78,970 మిలియన్‌ యూనిట్లు
– దానికోసం చేసిన ఖర్చు – రూ.39,722 కోట్లు (సగటు యూనిట్‌ రేటు రూ.5.03 పైసలు)
– తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ద్వారా ఆమోదించిన వ్యవసాయ విక్రయాలు, డిస్కంలు అంచనా వేసిన విక్రయాల మధ్య వ్యత్యాసం (నష్టాలతో కలిపి) – 39,798 మి.యూ.,
– దీనివల్ల పెరిగిన ఖర్చు – రూ.18,725 కోట్లు
– డిస్కంల మొత్తం నష్టాలు – రూ.62,461 కోట్లు
– డిస్కంల మొత్తం అప్పులు – రూ.59,132 కోట్లు
– టీఎస్‌ ట్రాన్స్‌కో మొత్తం అప్పులు – రూ.24,476.40 కోట్లు
– టీఎస్‌ జెన్‌కో మొత్తం అప్పులు రూ.53,963 కోట్లు
– వ్యవసాయ డిమాండ్‌ – 6,003 మెగావాట్లు
– కనెక్షన్ల సంఖ్య – 27.99 లక్షలు
– వ్యవసాయానికి సగటు సరఫరా గంటలు (2023 ఏప్రిల్‌-నవంబర్‌) 19.22 గంటలు
– రాష్ట్ర ఒప్పంద సామర్థ్యం – 19,475 మెగావాట్లు
– రాష్ట్ర గరిష్ట డిమాండ్‌ – 15,370 మెగావాట్లు
– ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ సామర్థ్యం కోసం చెల్లించిన చార్జీలు – 1,362.424 కోట్లు
– ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోసం ఉపయోగించిన కారిడార్‌కు చార్జీలు – రూ.723.923 కోట్లు
– ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కోసం ఉపయోగించని కారిడార్‌ కోసం చెల్లించిన మొత్తం – రూ.638.501 కోట్లు
– భద్రాద్రి థర్మల్‌ స్టేషన్‌ (1080 మెగావాట్లు) రెండేండ్ల నిర్మాణ సమయంలో ఒక్క మెగావాట్‌కు అయ్యే ఖర్చు ప్రణాళిక – రూ. 6.75 కోట్లు
– ఏడేండ్లు ఆలస్యం కావడంతో ఒక్క మెగావాట్‌కు అయిన ఖర్చు – రూ.9.74 కోట్లు