ఏప్రిల్‌-నవంబర్‌లో 1,099.90 బిలియన్‌ యూనిట్లకు చేరిన విద్యుత్‌ వినియోగం

న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్యకాలంలో దేశంలో విద్యుత్‌ వినియోగం 1,099.90 బిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్‌ వినియోగం దాదాపు తొమ్మిది రెట్లు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో విద్యుత్‌ వినియోగం 1,010.20 బిలియన్‌ యూనిట్లుగా ఉంది. 2021-22లో ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో విద్యుత్‌ వినియోగం 916.52 బిలియన్‌ యూనిట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విద్యుత్‌ వినియోగం 1,504.26 బిలియన్‌ యూనిట్లుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విద్యుత్‌ వినియోగం 1,374.02 బిలియన్‌ యూనిట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లోనే విద్యుత్‌ వినియోగం తొమ్మిది శాతం పెరగడం ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని చూపుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో దేశ విద్యుత్‌ డిమాండ్‌ 229 గిగావాట్లకు చేరుకుంటుందని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే ఏప్రిల్‌-జులైలో కురిసిన అకాల వర్షాల కారణంగా అంచనా వేసిన స్థాయికి విద్యుత్‌ డిమాండ్‌ చేరుకోలేదు. అయితే, జూన్‌లో కొత్త గరిష్ట స్థాయి 224.1 గిగావాట్లకు విద్యుత్‌ డిమాండ్‌ చేరుకుంది. జూలైలో 209.03 గిగావాట్లకు తగ్గినా, మళ్లీ ఆగస్టులో గరిష్ట డిమాండ్‌ 238.82 గిగావాట్లకు చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో 243.27 గిగావాట్లకు విద్యుత్‌ డిమాండ్‌ చేరుకుంది. అక్టోబరులో గరిష్ట డిమాండ్‌ 222.16 గిగావాట్లకు, నవంబర్‌లో 204.86 గిగివాట్లకు విద్యుత్‌ డిమాండ్‌ చేరుకుంది.
అనుకూల వాతావరణ పరిస్థితులు కారణంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్‌లలో విద్యుత్‌ వినియోగం పెరిగిందని, పండుగల ప్రభావంతో పారిశ్రామిక కార్యకలాపాలు కూడా పుంజుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2013-14 నుండి 2022-23 వరకు విద్యుత్‌ డిమాండ్‌ 50.8 శాతం పెరిగిందని ఈ వారం ప్రారంభంలో లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ తెలిపారు. 2013-14లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 136 గిగావాట్ల వద్ద ఉండగా, 2023 సెప్టెంబర్‌ నాటికి 243 గిగావాట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు.