కరెంటోళ్లు గ్రేట్‌…

కరెంటోళ్లు గ్రేట్‌...– మేడారంలో అవిశ్రాంతంగా విధుల నిర్వహణ
– అభినందించిన సీఎమ్‌డీ కర్నాటి వరుణ్‌రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మేడారం జాతరలో లక్షలాది మంది యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, రాత్రి వేళల్లోనూ పగలును తలపించేలా విద్యుత్‌ కాంతులు వెదజల్లడంలో కరెంటోళ్లు చేసిన కృషి చాలా గొప్పదని తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ కర్నాటి వరుణ్‌రెడ్డి కొనియాడారు. జాతర ఏర్పాట్లను విద్యుత్‌శాఖ ఉద్యోగులు తమ భుజస్కందాలపై వేసుకొని, ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా, అత్యంత పగడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేశారని తెలిపారు. నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం 24 గంటలూ విధుల్లోనే ఉన్నారనీ, సంస్థ డైరెక్టర్లు, సీజీఎమ్‌లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో చక్కగా పనిచేశార న్నారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.ఎప్పటికప్పుడు, ఎక్కడిక్కడ లోడ్‌ పర్యవేక్షణ చేస్తూ, రెండు సబ్‌ స్టేషన్ల ద్వారా విద్యుత్‌ సరఫరా అందించామన్నారు. యాత్రీకుల సంఖ్య మ రింత పెరుగుతుందనే అంచనాతో విద్యుత్‌ లోడ్‌లో ఇబ్బందులు తలెత్తకుం డా ఏర్పాట్లు చేశామన్నారు. మేడారం కొత్తూరు సబ్‌స్టేషన్‌లో రెండు 8 ఏంవీఏలు, సమ్మక్క సబ్‌స్టేషన్‌లో రెండు 5 ఏంవీఏ కెపాసిటీ పవర్‌ ట్రాన్స్‌ ఫార్లర్లు ఏర్పాటు చేశామని తెలిపారు .315 కేవీఏ సామర్ధ్యంతో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు, 160 కెవిఏ సామర్ధ్యంతో 84 ట్రాన్స్‌ఫార్మర్లు, 100 కెవిఏ సామర్ధ్యంతో 96 ట్రాన్స్‌ఫార్మర్లు, 25 కెవిఏ సామర్ధ్యంతో 24 ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే 66 కిలోమీటర్ల మేరకు 11 కేవీ ఎల్టీ లైన్లు విస్తరించామని తెలిపారు. ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకు న్నామని, భక్తులూ పూర్తి సహాయ సహకారాలందించారని చెప్పారు.