అదానీని తొలగించండి..ధారావిని రక్షించండి

ముంబయి: గౌతమ్‌ అదానీ పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూ.23 వేల కోట్లతో చేపట్టిన దారావి పునరాభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ అదానీ ముంబయి కార్యాలయాల వైపు ప్రతిపక్షాల నేతృత్వంలో వేలాదిమంది నిరసనకారులు కవాతు నిర్వహి ంచారు. ఆసియాలోనే అతిపెద్ద స్లమ్‌ క్లస్టర్‌లలో ఒకటైన ధారావిలోని 590 ఎకరాల పునరాభివృద్ధి ప్రాజెక్టును గత ఏడాది నవంబర్‌లో అదానీ ప్రాపర్టీస్‌ దక్కించుకుంది. తమ భూములను లాక్కునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ”అదానీని తొలగించండి, ధారావి ని రక్షించండి” నినాదంతో జెండాలు, బ్యానర్లను పట్టుకుని ముంబైలోని కలంగర్‌ నుంచి అదానీ గ్రూప్‌ కార్యాలయం ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ వరకు భారీ కవాతు చేశారు. మార్చ్‌కు నాయకత్వం వహించిన శివసేన (యూబీటీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే మాట్లాడుతూ తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని చెప్పారు. తన నాయకత్వంలోని మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వ హయాంలో బిల్డర్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే, తీర్మానాలు చేసుంటే ప్రజల ముందుం చాలని బీజేపీకి సవాల్‌ చేశారు. బిల్డర్‌కు అను కూలంగా తమ ప్రభుత్వం లేకపోవడం వల్లే తమ ప్రభుత్వం కూలిపోయిందని, అందుకు ఎవరు ఆర్థిక సహాయం చేశారో ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. ధారావి కోవిడ్‌ 19పై పోరాడిందని, ఏ బిల్డర్‌ ముందు లొంగిపోదని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి హక్కుల బదిలీ (టిడిఆర్‌), అక్రమాలు ఉన్నాయని విమర్శిచారు. ముంబై కాంగ్రెస్‌ చీఫ్‌, ధారావి ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్‌ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. పునరాభివృద్ధి సమయంలో ధారావి నివాసితులకు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లు, పోలీసు సిబ్బంది, కన్సర్వెన్సీ కార్మికులు, మిల్లు కార్మికులతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పునరాభివృద్ధిని ప్రభుత్వమే చేపట్టాలని కోరుతున్నారు.