వాషింగ్టన్ : కార్పొరేట్లు చెప్పే మాటలకు చేసే అనేక పనులకు సంబంధం ఉండదని ఎలన్ మస్క్ వ్యవహారం స్పష్టం చేస్తోంది. కృత్రిమ మేధా (ఎఐ) వల్ల ప్రపంచానికి, మానవాళికి తీవ్ర నష్టం వాటిళ్లనుం దని.. అలాంటి వాటి జోలికి పోవద్దని ఇటీవల ఎలన్ మస్క్ సహా గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ సహా అనేక మంది దిగ్గజ కార్పొరేట్లు ఓ బహిరంగ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. నాగరిక సమాజ భవిష్యత్తుకు ఉన్న అతిపెద్ద ప్రమాదాల్లో ఎఐ ఒకటని పేర్కొన్నారు. ఎఐ భద్రతను నియంత్రించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయ పడ్డారు. దీని నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ లేఖ రాసి నెల రోజులు కూడా కాకముందే టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మంగళవారం ఎఐ ఆధారిత ట్రూత్‌జిపిటి పేరుతో ఎఐ చాట్‌బాట్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ చాట్ జిపిటి బాటలో ఇప్పుడు అన్ని టెక్ దిగ్గజాలు పరుగులు పెడుతున్నాయి. చాట్ జిపిటికి పోటీగా గూగుల్ తన బార్డ్‌ను అభివృద్థి చేస్తోన్న విషయం తెలిసిందే.
ట్విట్టర్‌కు రెట్టింపు చెల్లించా.. : మస్క్
ట్విట్టర్ విలువ కంటే తాను ఎక్కువగా చెల్లించి ఆ సంస్థను కొనుగోలు చేశానని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ట్విట్టర్ స్వాధీనంపై ఆయన తాజాగా స్పందిస్తూ.. ” సంస్థ విలువకంటే రెట్టింపు ధరకు కొనుగోలు చేశాను. అది సరైన ఆర్థిక నిర్ణయం కాదు. కొనుగోలుకు సరైనా సమయం కూడా కాదు. ప్రస్తుతానికి ట్విట్టర్ కొనుగోలు పేలవమైన ఆర్థిక నిర్ణయం. ఇటీవల చేపట్టిన మదింపులో దాని విలువ.. కొనుగోలు చేసినదాంట్లో సగం ఉంటుందని లెక్కగట్టాం. 44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.5 లక్షల కోట్లు)తో ట్విట్టర్‌ను కొంటానని ఆఫర్ ఇచ్చిన సమయం సరైనది కాదు.” అని మస్క్ పేర్కొన్నారు.