అంతుచిక్కని ‘సోర్స్‌ కోడ్‌’ రహస్యాలు !

Secrets of the elusive 'source code'!– బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటున్న ఈసీ
– ఈవీఎంల పనితీరుపై పెరుగుతున్న అనుమానాలు
– పారదర్శకత, విశ్వసనీయత ఉండాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) సోర్స్‌ కోడ్‌ను స్వతంత్ర సంస్థ చేత తనిఖీ చేయించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సెప్టెం బరులో తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్‌ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదని భావిం చడానికి ఎలాంటి ఆధారాలు లేవని తీర్పు సందర్భంగా న్యాయ స్థానం వ్యాఖ్యా నించింది. అయితే ఈ తీర్పును మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు, వాస్తవాలు తెలుసుకునేందుకు ‘ది వైర్‌’ పోర్టల్‌ ప్రయత్నించింది. అందుబాటులో ఉన్న అనేక పత్రాలతో పాటు ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఈవీఎంల సోర్స్‌ కోడ్‌ వంటి సాధనాలపై విశ్లేషణ జరిపింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
అంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే
ఈవీఎంల తయారీ మొదలుకొని వాటిలో అమర్చే సాఫ్ట్‌వేర్‌ వరకూ ఎన్నికల యంత్రాంగం యావత్తూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ నియంత్రణలో ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ను మదింపు చేసేం దుకు ఏర్పాటు చేసే కమిటీ, ఆ సాఫ్ట్‌వేర్‌ను ఆడిట్‌ చేసే థర్డ్‌ పార్టీ కేంద్రం, ఈసీ కనుసన్నల్లోనే పనిచేస్తాయి. ఎన్నిక లకు ముందు చేపట్టే భద్రతా చర్యల్లో కూడా డొల్లతనం కన్పిస్తోంది. ఈవీఎంలను భద్రపరిచే ప్రదేశంలో వాటికి సీలు వేసే ముందు తనిఖీ చేయాల్సి ఉంటుంది. నియోజ కవర్గాలకు పంపే ఈవీఎంలను కూడా రాండమ్‌ పద్ధతిలో పరిశీలించాలి.
అయితే ఈ పనులు జరిగే సమయంలో ఎన్నికల కమిషన్‌ అధికారులెవ్వరూ హాజరు కారు. ఈవీఎంల తయారీదారుల తరఫున అధికారులు మాత్రం వస్తారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ కూడా హాజరవుతారు. రాష్ట్రాలకు కేటాయించే ఈవీఎంలపై ఎన్నికల కమిషన్‌ ఏమీ చెప్పదు. ఆ పనిని పీఎస్‌యూలకు అప్పగించి చేతులు దులుపుకుంటుంది. అయితే యంత్రాలు ఎక్కడ ఉన్నదీ మాత్రం ఎన్నికల కమిషన్‌ ట్రాక్‌ చేస్తుంది.
సోర్స్‌ కోడ్‌ అంటే…
సూచనలు చేస్తూ ప్రోగ్రామర్లు రాసేదే సోర్స్‌ కోడ్‌. ఈ కోడ్‌ సాఫ్ట్‌వేర్‌కు, ప్రోగ్రామ్‌కు పునాది వంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవీఎం చేసే ప్రతి పనికీ సోర్స్‌ కోడే మూలం. ఎలా పనిచేయాలో ఈవీఎంకు ఈ కోడ్‌ సూచనలు చేస్తుంది. ఈవీఎంకు మెదడు వంటి సోర్స్‌ కోడ్‌ను మార్చేస్తే ఎన్నికల ఫలితం తారుమారు అవుతుందని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన పిటిషనర్‌ వాదించారు.
ఎంతో కీలకమైన సోర్స్‌ కోడ్‌ను ఇప్పటి వరకూ ఎవరూ తనిఖీ చేయలేదు. దానిని ఎన్నికల కమిషన్‌కు కానీ, ఈవీఎం ఉత్పత్తిదారులకు కానీ, చివరికి దానిని తనిఖీ చేసే సాంకేతిక మదింపు కమిటీకి కానీ చెప్పరు. అసలు ఎన్నికల కమిషన్‌కు ఈ విషయంలో ఎలాంటి పాత్ర ఉండదు.

తప్పించుకు తిరుగువారు…
ఆర్‌టీఐ ద్వారా సోర్స్‌ కోడ్‌ను పొందేందుకు పిటిషనర్‌ సునీల్‌ ఆహ్యా 2018 నుండి అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓటింగ్‌ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు సోర్స్‌ కోడ్‌ను బహిర్గతం చేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషనర్‌ ఈసీకి సూచించారు. అయితే ఈ కోడ్‌ మధోసంపద హక్కు అని చెబుతూ ఈసీ నేటి వరకూ స్పందించలేదు. ఆహ్యా సుప్రీంకోర్టును ఆశ్రయించగా సాఫ్ట్‌వేర్‌ను సాంకేతిక కమిటీ తనిఖీ చేసిందని, సమాచారం దాని వద్దే ఉన్నదని చెప్పి ఈసీ తప్పించుకుంది.
మరోవైపు సాఫ్ట్‌వేర్‌ను ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ తనిఖీ చేసిందని సాంకేతిక కమిటీ చెబుతోంది. ఈ శాఖేమో సమాచారం ఈసీ వద్ద ఉన్నదని అంటోంది. ఇలా ఎవరికి వారు తప్పించుకుంటూ దాటవేత వైఖరి అవలంబిస్తున్నారు. 2017 మేలో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంను ఇప్పటి వరకూ ఒకే ఒకసారి తెరిచి పరిశీలించడం జరిగింది. అయితే ఫోరెన్సిక్‌ అధికారులు దానికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు.
ఆ దేశాల వైఖరి భిన్నం
ఆస్ట్రేలియా, వెనెజులియా, అమెరికా వంటి దేశాలు సోర్స్‌ కోడ్‌ను బహిర్గతం చేస్తున్నాయి. జర్మనీతో పాటు పలు దేశాలు ఈవీఎంల వినియోగానికి స్వస్తి చెప్పాయి. సోర్స్‌ కోడ్‌ను బహిర్గతం చేస్తే ఓటింగ్‌ యంత్రాలలోని సాప్ట్‌వేర్‌ను తారుమారు చేసే అవకాశం ఉందడని మన దేశంలో ఈవీఎంల పారదర్శకత కోసం పోరాడే వారు చెబుతున్నారు. కానీ సోర్స్‌ కోడ్‌ను బహిర్గతం చేయాల్సిన అవసరమే లేదని, న్యాయస్థానాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఈసీ అధికారులు తెలిపారు. అయితే ప్రజల సందేహాలను తీర్చాల్సిన బాధ్యత ఈసీ పైన ఉందని మాజీ సీఈసీ అశోక్‌ లావాస చెప్పారు. ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత, పారదర్శకతతో పనిచేయాలని, చర్చల ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు.
ఆ రెండు సంస్థల చేతిలోనే
ఈవీఎంల ఉత్పత్తిదారులైన ప్రభుత్వ రంగ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) సంస్థలకు చెందిన ఎంపిక చేసిన ఉద్యోగులు సోర్స్‌ కోడ్‌ను రూపొందించి, సాఫ్ట్‌వేర్‌ను రాస్తారు. ఈ రెండు సంస్థలూ ఈసీ ఆజమాయిషీలో ఉండవు. బీఈఎల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కింద, ఈసీఐఎల్‌ అణు ఇంధన శాఖ కింద పనిచేస్తున్నాయి. ఈవీఎంల సాఫ్ట్‌వేర్‌ను ఈ రెండు సంస్థలు విడివిడిగా, దేనికదే అభివృద్ధి చేస్తాయి. ఆయా సంస్థలకు చెందిన ఇంజినీర్లతో కూడిన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ గ్రూపు సోర్స్‌ కోడ్‌ను రూపొందిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను సంస్థలోని మరికొందరు ఇంజినీర్లు పరీక్షిస్తారు. ఆ తర్వాత దానిని సాంకేతిక మదింపు కమిటీలు తనిఖీ చేస్తాయి. అనంతరం ఈ కమిటీలు సాంకేతికపరమైన సలహాలు ఇస్తాయి.
కమిటీలకు సోర్స్‌ కోడ్‌ చెబుతారో లేదో ఈసీ వెల్లడించడం లేదు. ఈవీఎంలో అమర్చిన సాఫ్ట్‌వేర్‌ సైతం ఈసీ అధీనంలో ఉండదు. దానిపై హక్కు ఉత్పత్తిదారులు, సాంకేతిక నిపుణులకు మాత్రమే ఉంటుంది.
సాంకేతిక కమిటీ సూచించినా
2010వ సంవత్సరం వరకూ ఈసీ కానీ, సాంకేతిక కమిటీ కానీ, ఉత్పత్తిదారులు కానీ, థర్డ్‌ పార్టీ కానీ ఈవీఎంలో అమర్చిన చిప్‌ నుండి సోర్స్‌ కోడ్‌ను పొందలేకపోయాయి. దీనిపై 2021 నవంబరులో ఈసీ వివరణ ఇచ్చింది. ముందుగానే లోడ్‌ చేసిన చిప్స్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, హార్డ్‌వేర్‌ను కదిలిస్తే చిప్‌ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపింది.
కాగా సోర్స్‌ కోడ్‌ను బహిర్గతం చేయాలని 1990లో సాంకేతిక కమిటీ సూచించింది. 2006లో కూడా దానిని పునరు ద్ఘాటించింది. సోర్స్‌ కోడ్‌ రహస్యాన్ని బట్టబయలు చేయాలని ఈ కమిటీ పదే పదే కోరుతూ వచ్చింది.