– గల్ఫ్ దేశాల్లో 10లక్షల మంది తెలంగాణ కార్మికులు
పొట్ట చేత పట్టుకొని వేల మైళ్ల దూరం వెళ్లిన అభాగ్యులకు అక్కడ చేయూత కరువై.. చేద్దామంటే పని లేక కొన్నిసార్లు ఉత్త చేతులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇక్కడికొచ్చాక అప్పులు చెల్లించాలంటూ వేధింపులు.. ఇంటి భారమూ మోయలేని పరిస్థితులు.. ఇలా మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ప్రభుత్వాలు తప్ప ఎవరూ ఆదుకోలేరు. కానీ, ప్రవాసుల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకోవడానికి ప్రత్యేక నిధి కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు కోరుతున్నారు.
నవతెలంగాణ – సిరిసిల్ల
రాష్ట్రంలోని ప్రధా నంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, కరీం నగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి యూఏఈ, సౌదీ అరేబియా, ఓమన్, కతర్, కువైట్, బెహరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు సుమారు 10లక్షల మంది ఉపాధి కోసం వెళ్లారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు కూడా వేల సంఖ్యలో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు పలు సందర్భాల్లో అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో గల్ఫ్ వెళ్లిన వారితోపాటు ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు కూడా గల్ఫ్ పాలసీ ప్రకటించాలని కొంత కాలంగా డిమాండ్ పెరుగుతోంది.
రాష్ట్రంలో 2014మ్యానిఫెస్టోలో గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500కోట్ల నిధులు వెచ్చిస్తామని, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.5లక్షలు ఇస్తామని, ఏజెంట్ల మోసాలపై కఠిన చట్టాలు తీసుకొస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో ఈసారి శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు గల్ఫ్ బాధిత కార్మిక కుటుంబాలు కూడా బరిలో నిలిచాయి. ఈ ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు గత ఏడాది 1200మంది మృతిచెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో సంక్షేమ నిధి ఆసరాగా నిలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. అక్కడ ఇబ్బందులు ఎదురైనప్పుడు సంక్షేమ నిధి నుంచి వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది.
డిమాండ్లు ఇవీ!
– గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో స్థిరపడిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే పాలసీ ప్రకటించాలి. గల్ఫ్ బిడ్డల భద్రత, సంక్షేమం కోసం చట్టసభల్లో విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తూ అభాగ్యులను గల్ఫ్ దేశాలకు పంపే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందజేయాలి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి.
– బడ్జెట్లో గల్ఫ్ సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. కేరళ విధానం చాలా బాగుంది. కేరళ ప్రవాసీల కోసం ప్రత్యేక నిధి కేటాయించింది. అంతేకాకుండా కేరళ రాష్ట్రం నుంచి ఎంబసీలో ఐదు నుంచి పది మంది అధికారులు ఉంటారు. చనిపోయిన గల్ఫ్ కార్మిక కుటుంబానికి ఎన్నారై పాలసీ ద్వారా రూ.10లక్షల బీమా ఇస్తోంది. కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. గల్ఫ్ దేశాల్లో ఆదరణ ఉన్న ఉద్యోగాలకు ఉచిత సాంకేతిక శిక్షణ అవగాహన కల్పించాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన వారితో పాటు వివిధ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి వివరాలను కేంద్రం భారత రాయబార కార్యాలయం ద్వారా సేకరించి సమస్యలు పరిష్కరించాలి. అనుకోని ఘటనల్లో గాయపడిన, అచేతన స్థితిలోకి వెళ్లిన వారికి ప్రభుత్వమే వైద్య చికిత్స అందించాలి.
హామీలు అమలు చేయలేదు
గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గల్ఫ్‌లో చనిపోయిన వారి మృతదేహాలను మా అవగాహన వేదిక ద్వారా స్వదే శానికి తెప్పించి వారి కుటుంబాలకు కోటి రూపాయ లకుపైగా ఆర్థిక సహాయం చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోని డిమాండ్లను తప్పనిసరిగా నెరవేర్చాలి. కేరళ తరహాలో తెలంగాణలోనూ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
– కృష్ణ దొనికేని, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు