తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ప్రజాస్వామిక ”తెలంగాణలో మరోసారి ఎనుకటి కాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. హక్కులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతారు. ఇది నియంత త్వ రాజ్యం” అని ఆరోపించారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదనీ, ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉన్నదని తెలిపారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌
హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. ”బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో 1,61,000 పోస్టులను భర్తీ చేసింది. నియామకాలపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నది. స్వంతగా 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొడుతున్నారు. 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసినవే కాదా? ఎన్నికల కోడ్‌ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలు ఇచ్చి, అవన్నీ తామే చేసినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు” అని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, 18 ఏండ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఫించన్‌, ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు, ప్రతి పంటకు బోనస్‌, కల్యాణలక్ష్మి, లబ్ధిదారులకు తులం బంగారం, మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్‌ వాహనాల హామీలకు అతీగతీ లేదని విమర్శించారు.
కులగణన పకడ్బందిగా నిర్వహించండి
రాష్ట్రంలో కులగణనలో తప్పులకు ఆస్కారం లేకుండా .రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 242, 343 ప్రకారం పకడ్బందిగా నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయ మూర్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలో పర్యటిస్తున్న బీసీ కమిషన్‌ను కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు కిషోర్‌గౌడ్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్లు ఆంజనేయగౌడ్‌, పల్లె రవికుమార్‌, రాజీవ్‌ సాగర్‌ పాల్గొన్నారు.