– ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు దుర్మార్గమైన చర్య : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్‌ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఆయన ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా ‘ఎమర్జెన్సీ’ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారనని విమర్శించారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బీఆర్‌ఎస్ గొంతునొక్కే విఫల యత్నం చేస్తున్నారు. రోజురోజుకూ పెరిగి పోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలె త్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారని తెలిపారు. అక్రమంగా అరెస్టుచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చరమగీతం పాడాలని కోరారు. బీఆర్‌ఎస్‌కు కేసులు కొత్తకాదనీ, అరెస్టులు అంత కన్నా కాదనీ పేర్కొన్నారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? : హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును మాజీ మంత్రి టి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఉదయాన్నే పోలీసులు ఆయన ఇంటి వద్దకు వచ్చి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సెలవు రోజుల్లో కావాలని తమ నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని తెలిపారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు ఎవరూ లేరని గుర్తుంచుకోవాలని కోరారు. తెలంగాణ సమాజమే ఆయనకు తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.