ప్రపంచంలోని అన్ని దిక్కుల నుండీ వచ్చే ఆలోచనలను ఆహ్వానించాలి అని ఉపనిషత్‌కారులు అంటారు. ‘వందపుష్పాలు పుష్పించనీయండి, వేయి ఆలోచనలు తలెత్తనీయండ’ అని ప్రసిద్ధ విప్లవకారుడు మావో అంటాడు. ఈ ప్రపంచం గురించి, సమాజ జీవనం గురించి ఆలోచన చేసిన చింతనాపరులందరూ విభిన్న ఆలోచనలను, అభిప్రాయాలను ఆహ్వానించిన వారే. వాదానికి, చర్చకు, పెట్టింది పేరు మన భారతీయ తాత్విక సంప్రదాయం. ఎదుటివారి ఆలోచనను, అభిప్రాయాన్ని విన్నప్పుడే, అందులోని మంచి చెడ్డలు తెలిసి వచ్చేది. అసలు వినటానికి, చూడటానికి సమ్మతించక అసహనంతో విధ్వంసానికి పాల్పడటం నియంతృత్వ చర్యే అవుతుంది. గతంలో రాజ్యాలూ రాజులు చేసిన పనే ఇది. కానీ ఇప్పుడు మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం. ప్రతిఒక్కరికీ తమ భావాలను వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ, హక్కు ఉంటుంది. ఈవ్యవస్థలోనే స్వేచ్ఛను హరించడమంటే, వారి ఆలోచనలు, ఆచరణ ఎంత వెనక్కి మళ్లీ ఉన్నాయో అర్థమవుతుంది.
అలాంటి ఘటనే ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగింది. ఈనెల 15 నుండి 17వరకు 9వ ఫిలిం ఫెస్టివల్‌ను, సినిమా ఆఫ్ రెసిస్టెన్స్, ఉదయపూర్ ఫిలిం సొసైటీవారు సంయుక్తంగా నిర్వహిస్తు న్నారు. ఈ ఉత్స వాలను, ఇటీవల మరణించిన పౌరహక్కుల పోరాట నేత ప్రొఫెసర్ సాయిబాబా, ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన పాలస్తీనా పిల్లల స్మృతిలో వీటిని జరుపుతున్నారు. ఈ కారణంగా ఎక్కడలేని ఆవేశాన్ని విద్వేషాన్ని నింపుకున్న రాష్ట్రీయ స్వయం సేవకులు (ఆర్.ఎస్.ఎస్) ఉత్సవాన్ని అడ్డుకుని భావ విధ్వంసాన్ని కొనసాగించారు. స్థానిక రవీంద్ర నాథ్ వైద్య కళాశాలలో అన్ని అనుమతులు తీసుకుని నిర్వహిస్తున్న ఫిలిం ఫెస్టివల్‌పై దాడికి పాల్పడటం అత్యంత అరాచక చర్య. చనిపోయిన సాయిబాబా, ఇంకా వీళ్లను భయపెడుతూనే ఉన్నాడనడానికి ఇదో ఉదాహరణ. ఏ నేర రుజువులు లేకుండానే జైళ్లో నిర్భంధించి, అతని మరణానికి కారకులైన వారి వారసులు, అతని పేరు వింటేనే బెంబేలెత్తుతున్నారు.
ప్రపంచంలోని మానవీయులందరూ పాలస్తీనా విధ్వంసంలో పసిబాలల మరణాలపై తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పాలస్తీనా నరమేధం ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తుతూ ఉంది. కానీ ఆ అమానవీయులకు స్పందన లేకపోగా, నరమేధాన్ని బలపరుస్తున్నారు. సాయిబాబాను ఉగ్రవాదిగా భావిస్తున్నారు. వీళ్లు, పాలస్తీనా ప్రజలు అంతమవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే, వారి స్మృతిలో జరుగుతున్న చిత్రోత్సవాన్ని అడ్డుకున్నారు. ప్రజా స్వామిక వ్యవస్థలో భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని అడ్డుకోవటం ఫాసిస్టు లక్షణం. ఒక ప్రత్యామ్నాయ సినిమాను ప్రజలకు అందించాలనే ఆశయంతో ఏర్పాటు చేస్తున్న సినీ ఉత్సవాన్ని అడ్డుకోవటమే కాకుండా, దానికి సంబంధించిన ఫేస్‌బుక్ ప్రకటనలను కూడా నిలుపుదల చేశారు. అక్కడినుండి ఆ ఉత్సవాన్ని వేరే చోటికి తరలించారు. కానీ అల్లరి చేసిన మూకపై ఎలాంటి చర్యలూ అక్కడి అధికారులు తీసుకోలేకపోయారు.
సాంస్కృతికపరమైన భిన్న ఆలోచనలను ధ్వంసం చేయటం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇది భిన్న త్వంలో ఏకత్వ భారతీయ జీవన విధానానికి తీవ్ర విఘాతం. ఇవే సంస్థలు మన హైదరాబాద్‌లో ‘లోక్ మంథన్’ పేరిట అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నా యి. మన సంస్కృతీ సంప్రదాయాలను పునరుద్ధరిం చేందుకు, విశ్వ ఐక్యత ప్రాశస్త్యాన్ని ప్రతిపాదించేందుకు నిర్వహిస్తున్నామని చెబుతున్న వీరు దేశంలోని భిన్న ఆలో చనను వినేందుకే ఇష్టపడటం లేదు, అంటే సంఘ పరివారం చెప్పే విషయాలను అందరూ అంగీకరించాలనే ఆ రకంగా ఏకీకృత సాంస్కృతిక నియంతృత్వాన్ని అమలు చేయాలన్నది వారి ఆలోచన. ఇక సంప్రదాయాలను సంస్కృతీ పునరుద్ధరణ అంటే మనువాద వర్ణవ్యవస్థ, అసమానతల, అనాగరిక ఆధిపత్య వ్యవస్థను కొత్తగా మళ్లీ నిర్మించు కోవడం. ఇదీ వీరి పథకం.
అందుకే వీరికి ప్రజాస్వామ్యమన్నా, ప్రగతిశీలమన్నా వెర్రెత్తుకొస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నా కూడా వీళ్లు సహించరు. అంబేద్కరు అందించిన రాజ్యాంగమంటే వీరికి కంటగింపు. ఆలోచనలను అణచివేయాలని వీరు చేసే ప్రయత్నం సఫలం కాదు. ఎందుకంటే అలా చేయాలని ప్రయత్నించిన నియంతలెందరో చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అడ్డుకోవాలని చేసే ప్రతిచర్యనూ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంటారు.పైకి ప్రజాస్వామ్యమనే ముసుగువేసి, లోపల ఫాసిస్టు తరహా చర్యలకు పూనుకొంటున్న పగటి వేషాలను ప్రజలు పసిగట్టి ప్రతిఘటిస్తారు!