ఉద్యోగులపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతున్నది. వారిని బానిసలుగా చూసే పద్ధతి విస్తరిస్తున్నది. ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తే పెట్టుబడిదారి నైజం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నది. ఈ మధ్యకాలంలో లారెన్స్ అండ్ టుబ్రో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యం తమ ఉద్యోగులతో నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఒక ఉద్యోగి, ”ఇంత సాంకేతికత అభివఅద్ధి చెంది, కంపెనీ ఇంతగా లాభాలు అర్జిస్తూ, విస్తరిస్తున్న దశలో శనివారం పనిచేయడమేమిటి, వారానికి ఐదు రోజుల పనివ్వచ్చు కదా!” అని అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానమిచ్చారు. ”నేను మీతో ఆదివారాలు కూడా పని చేయించలేక పోతున్నందుకు చింతి స్తున్నాను. మీరందరూ వారానికి తొంభై గంటలు పనిచేస్తే నేను ఎంతో సంతోషిస్తాను.నిజం చెప్పాలంటే ఆదివారాలు కూడా పనిచేయిస్తే ఎంతో సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పనిచేస్తాను.” అన్నారు. అంతటితో ఆగకుండా, ”ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, ఎల్లకాలం భార్య మొఖం చూసుకుంటూ కూర్చుంటారా? లేక భార్యలు భర్తల మొఖాలు చూస్తూ కూర్చుంటారా? రండి,ఆఫీస్‌కు వచ్చి పనిచేయండి.” అన్నారు. ఇంకా ”వారానికి తొంభై గంటలు పని చేయొచ్చు కదా” అని అన్నారు. ఇంతకుముందు ఇన్ఫోసిస్ అధినేత శ్రీఎన్ ఆర్ నారాయణమూర్తి ఉద్యోగులు డెబ్బయి గంటలు పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని మాట్లాడారు. అలాగే ”ఓలా” పౌండర్ విష్ అగర్వాల్ ” శని, ఆదివారం వారాంతపు సెలవులు అనేది భారతీయ సంస్కృతి కాదు. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. మన సంస్కృతి ప్రకారం నెలకి రెండు రోజులు సెలవుంటే సరిపోతుంది.” అన్నారు. అంతేకాకుండా ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్ వారానికి తొంభై నుంచి వంద గంటలు పని చేయాలన్నాడు. కార్పొరేట్లు, పెట్టబడుదారులు ఇలా కార్మికులను ఉద్యోగులను ఎనిమిది గంటలకంటే ఎక్కువ పని చేయించుకోవాలనే ఆలోచనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. దానికి కారణం మారిన ప్రపంచ రాజకీయ పరిస్థితులు, దానికి తోడు వారికి లాభాల పైనున్న మితిమీరిన తృష్ణే, ఇలా బరితెగించి మాట్లాడిస్తున్నాయి.
ఎనిమిది గంటలు పని విధానమెలా వచ్చింది?
ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఎనిమిది గంటల పనిదినాన్ని ఒక శతాబ్దం పైగా అనుభవిస్తున్నారు. 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభ దశలో పరిశ్రమలు స్థాపించబడిన ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కార్మికులను పది నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేయించుకునేవారు.”పని-జీవితం సమతుల్యత” ఉండాలంటే, సోషలిస్టు నాయకుడు రాబర్ట్ ఓవెన్ 1810లో కార్మికులు 24 గంటల ఒక రోజును మూడు భాగాలుగా విభజించి, ఎనిమిది గంటలు విశ్రాంతి, నిద్రకోసం, మరొక ఎనిమిది గంటలు వ్యక్తిగత అవసరాలు, కుటుంబ పనులు, ప్రయాణాలు వంటివి నిర్వహించుకోవడానికి పోగా, ఎనిమిది గంటలు పరిశ్రమలో పనిచేయడానికి వీలుగా ఉండాలని డిమాండ్ చేయడం జరిగింది. 1845లో కార్ల్‌మార్క్స్ స్నేహితుడైన ఏంగిల్స్, పారిశ్రామికవేత్త అయిన తన తండ్రి మాంచస్టర్‌లో ఏర్పాటు చేసిన నూలుమిల్లును చూసుకోవడానికి వెళ్లినప్పుడు ఆనాటి కార్మికుల దుర్భర పరిస్థితులను గమనించి ‘ఇంగ్లాండ్‌లో కార్మికుల పని పరిస్థితులు’ అనే గ్రంథం రాశారు. ఆ రోజుల్లో పరిశ్రమల్లో మగవారితోనే కాకుండా స్త్రీలు, పిల్లలతో 12,16,18 గంటల వరకు పని చేయించు కునేవారు. ఆ తర్వాత 1866లో కార్ల్‌మార్క్స్, ఏంగిల్స్ స్థాపించిన ”ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్” ఎనిమిది గంటల పనిదినంకై పోరాడాలని తీర్మానం చేసి, ప్రపంచ కార్మికులకు, కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కావాలని కోరుతూ పెద్ద ఊరేగింపు నిర్వహించారు. కక్షగట్టిన పెట్టుబడిదారులు ఆ ఊరేగింపుపై పోలీసులతో జరిపించిన కాల్పుల్లో ఆరుగురుకార్మిక నాయకులు చనిపోయారు. వారి త్యాగాల మూలంగానే ఈనాటి ఎనిమిది గంటల పనిదినం అనే హక్కును అనుభవిస్తున్నాము. వారు చిందించిన రక్తం నుంచే ఎర్రజెండా పుట్టింది. అందుకే మనం వారి సంస్మరణగా ప్రతి సంవత్సరం ‘మేడే’ను మే ఒకటిన నిర్వహించుకుంటున్నాం. 1917లో రష్యాలో లెనిన్ నాయకత్వంలో సోషలిస్టు విప్లవం విజయవంతమైన తర్వాత మొదటగా ఎనిమిది గంటల పనిదినాన్ని చట్టబద్ధం చేశారు. ఆ విధంగా 8 గంటల పనిదినం అనేది అమల్లోకి వచ్చింది. ఆ తర్వాతే ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలు ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.
పెట్టుబడిదారుల దోపిడీ, లాభాల వేటకు అంతుందా?
తొంభై గంటలు పనిచేయాలని కోరుకునే ఎల్‌అండ్‌టి సంస్థ ఏమైనా నష్టాల్లో ఉందా అంటే లేనేలేదు. 2023-24 సంవత్సరానికి గాను రూ. 2,21,000 కోట్ల వ్యాపారం చేసి రూ.13,059 కోట్ల లాభాలను ఆర్జించింది.70 గంటలు పని చేయాలని కోరుకుంటున్న ఇన్ఫోసిస్ సంస్థ 2023-24 సంవత్సరానికి రూ.1,53,670 కోట్ల వ్యాపారం చేసి, రూ.26,232 కోట్ల లాభాలను ఆర్జించింది. అయినప్పటికీ వీరికి ఇంకా లాభాలు రావాలని తాపత్రయ పడుతుంటుంటారు. ఈ కార్పొరేట్ యజమానుల ప్రకటనల పట్ల ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది స్పందించారు. వ్యతిరేకతను వ్యక్తపరిచారు.
శాస్త్ర, సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, అత్యాధునిక యంత్రాలు, మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం అన్నంతగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏఐ టూల్స్ లాంటి వచ్చినప్పటికీ వాటి ద్వారా పెట్టుబడిదారులు లాభాలు గ్రహించవచ్చు కదా! కానీ అవి మాత్రమే లాభాలను చేకూర్చవు. అవి మానవ శ్రమను తగ్గించి సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వవచ్చు. ఇంకా పనిగంటలు తగ్గించవచ్చు. కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థలో అలా జరగదు. ”యంత్రాలు విలువను సృష్టించవు. యంత్రాలు నిర్జీవ శ్రమకు ప్రతిరూపాలు. అవి కూడా గతకాలపు మనుషులు చేసినవి. అందులో కూడా శ్రమనిక్షిప్తమై ఉంది. ఆ శ్రమకు కొత్తగా అదనంగా చేరేది లేదు. ఆ శ్రమ ఒక్కొక్క వస్తువు తయారు చేస్తున్నకొద్దీ దాని వాటా తగ్గిపోతుంది. చివరికి యంత్రం పట్టిపోతుంది. కానీ మనిషి సృజనాత్మకతతో, తన కండరాలతో చేసే పనివల్ల ఎప్పటికప్పుడు కొత్త అదనపు విలువ సృష్టిస్తాడు. శ్రమ చేస్తాడు కనుక మనుషుల వల్ల సజీవ శ్రమవల్లనే విలువ ఉత్పత్తి అవుతుంది.అదనపు విలువ ఉత్పత్తి అవుతుంది. నిర్జీవ శ్రమవల్ల కాదు.” అని కారల్ మార్క్స్ అన్నారు. ఇంకా ”వస్తువులకు విలువ ఎట్లా వస్తుందంటే, సంపద ఎలా తయారవు తుందంటే అది సజీవశ్రమ ద్వారా మాత్రమే. సజీవశ్రమ నుండే అదనపు శ్రమను రాబట్టి, అదనపు విలువగా మార్చుకున్నప్పుడే లాభం వస్తుంది.” అన్నారు. అందుకే కార్పొరేట్ యజమానులకు ఉద్యోగులు మనుషులుగా కనపడటం లేదు. యంత్రాల్లాగా కనపడుతున్నారు. తమ లాభాల కోసం పనిచేయాల్సిన మిషన్స్‌లా చూస్తున్నారు. ఈ మనస్తత్వం ప్రమాదకరం. ఈ విధమైన ఆలోచన ధోరణి సరైంది కాదు. ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలో పనిచేసే ఉద్యోగులపై పనిభారం పెంచుతూ, తలకుమించిన టార్గెట్లు పెడుతూ వారిని పీల్చి పిప్పిచేస్తున్నారు ”వర్క్ ఫ్రం హోమ్” కల్చర్ ప్రారంభమైనప్పటి నుండి ఉద్యోగుల జీవితంలో పనికి, జీవితానికి తేడా లేకుండా రాత్రింబవళ్లూ పనిచేయాల్సి వస్తున్నది. అందుకే మార్క్స్ – ”పెట్టుబడిదారులు కార్మికులను ఎక్కువ గంటలు పని చేయించడం ద్వారా వాళ్లను మృత్యువుకు దగ్గర చేస్తున్నారు.” అంటారు.
ఉదారవాద ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాలను అమలు చేస్తున్న మనదేశంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు, కార్మిక,రైతు, ప్రజావ్యతిరేక చట్టాల మూలంగా ఈరోజు కార్పొరేట్, పెట్టుబడిదారి వర్గాలు బరితెగించి ప్రవర్తిస్తున్నాయి. శతాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని హరిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఎనిమిది గంటల పని విధానాన్ని హరిస్తూ, యజమానులు 12 గంటల వరకు పనిచేయించుకోవచ్చని, కార్మిక సంఘాలను పెట్టుకోకుండా చేయడం, కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా, రోజువారి కనీస వేతనం 178 రూపాయలుగా నిర్ణయించడం లాంటివి పెట్టుబడిదారీ వర్గానికి మేలుచేసే విధంగా, కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు దాసోహమయ్యే లాగా తిరిగి మధ్యయుగాలనాటి స్థితికి తీసుకువెళ్లాలని ఒక ప్రయత్నం జరుగుతుంది.
ఈ నాలుగు లేబర్ కోడ్‌లను ఏప్రిల్ నుండి అమలు చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇవే కనుక అమల్లోకి వస్తే కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు పట్టపగ్గాల్లేకుండా పోతాయి. కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా తయారవుతాయి. ఉద్యోగులు, కార్మికులు ఆధునిక బానిసలుగా మారతారు. పనిగంటల తగ్గింపునకు జరిగే ఉద్యమం, వర్గ పోరాటంలో ఒక అంశం’ అని కార్ల్ మార్క్స్ అంటారు. గనుక కార్మిక వర్గం, ప్రజానీకం ఈ కార్మిక,కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, తద్వారా వాటిని నిలువరించాలి.
– నామని భిక్షపతి, 9494800073