బడ్జెట్‌పై ఉద్యోగుల గుర్రు!

– పీఆర్సీ, పెండింగ్‌ డీఏల ప్రస్తావన లేదు
– సీపీఎస్‌ రద్దుపైనా స్పష్టత కరువు
– కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో హామీల అమలేదీ
– మొదటి తారీఖున జీతాలిస్తున్నామన్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెనుసవాల్‌. తలకుమించిన రుణభారం ఉన్నప్పటికీ, దుబారా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. తద్వారా ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది. ఈ ఏడాది మార్చి నుంచి 3.69 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.87 లక్షల పెన్షన్‌దారులకు క్రమం తప్పకుండా ప్రతినెలా మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది’అని బడ్జెట్‌ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వారు ఎదుర్కొంటున్న సమస్యలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. దీంతో వారు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. పీఆర్సీ కమిటీ చైర్మెన్‌గా శివశంకర్‌, సభ్యుడు బి రామయ్యను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. పీఆర్సీపై కసరత్తును ప్రారంభించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కానీ ఇంత వరకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించలేదు. గతేడాది జులై ఒకటో తేదీ నుంచి రెండో పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌)ను ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీ గురించి, ఫిట్‌మెంట్‌ గురించి బడ్జెట్‌లో ఏమైనా ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ దాని ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి చెల్లింపుపైనా ప్రభుత్వం బడ్జెట్‌లో ఏమైనా ప్రకటిస్తుందని భావించారు. కానీ నిరాశే ఎదురైంది. వాటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి ఈ-కుబేర్‌లో వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావించలేదు. మొదటి తారీఖున జీతాలిస్తున్నామనే మాట తప్ప వారి సమస్యలను ఏవీ బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)ను పునరుద్ధరిస్తామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. బడ్జెట్‌లో ప్రసంగంలో దాని గురించి ఏమైనా ప్రస్తావన ఉంటుందేమోనని ఆశించారు. కానీ ఉద్యోగులకు భంగపాటు ఎదురైంది.