– 25 రోజులుగా తెరచుకొని పరిశ్రమలు..
– టెక్స్ టైల్ పార్క్ గేటు ముందు కార్మికుల నిరసన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గత 25 రోజులుగా టెక్స్ టైల్ పార్క్ వస్త్ర పరిశ్రమలు ప్రారంభించక కార్మికుల జీవితాలతో యజమానులు చెలగాటమాడుతున్నారని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మండిపడ్డారు. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్ టైల్ పార్కు గేటు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులందరూ తమ సమస్యలు పరిష్కరించాలని శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అడ్డ మీద కూలీల కంటే అద్వానంగా టెక్స్ టైల్ పార్క్ కార్మికుల బ్రతుకులు మారాయన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి టెక్స్ టైల్ పార్కులో పూర్తిస్థాయిలో పరిశ్రమలను ప్రారంభించి నిరంతరం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల శాశ్వత ఉపాధి కల్పన కోసం గత 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులో యజమానులు తరచూ పరిశ్రమలను మూసివేసి, కార్మికులను రోడ్డున పడేసి, ఉపాధి పేరుతో కార్మికుల బతుకులను అడ్డం పెట్టుకొని సమస్యలు పరిష్కరించుకుంటూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు ఆర్డర్లను నడిపించకుండా కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడి పరిశ్రమలను నడిపిస్తూ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అన్నల్దాస్ గణేష్, టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్, ఆడెపు శుభ శేఖర్, దూస రాజమల్లు, ఆడేపు రవి, సంపత్, శ్రీనివాస్, ఆంజనేయులు, వరప్రసాద్, రంగయ్య, ప్రభాకర్, సత్యనారాయణ, ఆంజనేయులు, రమేష్, అశోక్, రాజు కార్మికులు పాల్గొన్నారు.