ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్‌ బాడీ ఏర్పాటు చేయాలి

ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్‌ బాడీ ఏర్పాటు చేయాలి– పేదలకు కొత్త జాబు కార్డులివ్వాలి
– ‘ఉపాధి’ని వ్యవసాయానికి అనుసంధానం చేయొద్దు : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు వ్యకాస వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు రాష్ట్ర కౌన్సిల్‌ బాడీని ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు కొత్త నర్సింహులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అందులో వ్యవసాయ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయొద్దని నొక్కి చెప్పారు. పేదలకు లబ్ది చేరేలా కొత్త జాబుకా ర్డులివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అనితారామచ ంద్రన్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఉపాధి హామీ పనుల సందర్భంగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..ఉపాధి పనులను డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలనే నిబంధనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్రం నిర్ణయాలు ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. పనిప్రదేశంలో మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరారు. మేట్లను పర్మినెంట్‌ చేయాలనీ, ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీతాలు పెంచి వారిని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈజీఎస్‌ పనులను 150 రోజులకు పెంచి వేతనం రూ.350 పెంచుతామనే నిర్ణయం మంచిదైనప్పటికీ పనిదినా లను 200కు పెంచి కనీస వేతనం రూ.600 ఇచ్చేలా చూడాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి పనులు చేపట్టాలనీ, దానికి బడ్జెట్‌లో పదిశాతం నిధులు కేటాయించాలని విన్నవించారు. చట్టాన్ని పటిష్టంగా అమలు జరపడంతో పాటు మెడికల్‌ కిట్లు, పనిముట్లు, రవాణాచార్జీలివ్వాలనీ, పనిప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీల ద్వారా కూలీలకు నీళ్లు అందిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామనీ, ఒక్కొక్కరికి కనీసం 5 లీటర్ల నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.