ఉపాధి సోషల్‌ ఆడిట్‌ యూనిట్లకు సుస్థి

audit1 copy– తక్కువ నిధులతో సతమతం
– తగిన సంఖ్యలో లేని సిబ్బంది
– నిధుల రికవరీలోనూ పేలవ ప్రదర్శన
– కేంద్రం తీరుపై విమర్శలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద నిధుల దుర్వినియోగాన్ని ఎత్తి చూపటానికి, తనిఖీ చేయడానికి ఉద్దేశించిన అంతర్గత యంత్రాంగం ఆశించిన రీతిలో పని చేయటం లేదు. అనేక కారణాలతో ఇది నిష్క్రియాత్మకంగా మారుతున్నది. దీంతో ఈ పథకంలో అవకతవకలు మరింత తీవ్రమయ్యే ప్రమాదమున్నదని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకంలో ఏదైనా అవకతవకలను గుర్తించడానికి ఉద్దేశించినవే సోషల్‌ ఆడిట్‌ యూనిట్లు. అయితే, ఇవి ప్రస్తుతం నిధుల కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. శిక్షణ పొందిన లేదా తగిన సిబ్బందిని కలిగి లేదు. సోషల్‌ ఆడిట్‌ యూనిట్‌ ఏకైక బాధ్యత పథకంలోని దుర్వినియోగ కేసులను ఎత్తి చూపటం. ఆ తర్వాత దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయటం, బాధ్యులను మందలించటం అనేది ప్రభుత్వం కర్తవ్యం. అయితే, ఇవేమీ ఈ పథకంలో ఆశించినంతగా పని చేయకపోవటంతో పథకం ఉద్దేశమే ప్రమాదంలో పడిపోయే ప్రమాదమున్నదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్‌ ఆడిట్‌ యూనిట్లు ఎత్తి చూపిన కేసులలో కూడా అపహరణకు గురైన నిధుల రికవరీ చాలా దుర్భరంగా ఉన్నదని ఒక ఆంగ్ల వార్త పత్రిక కథనాన్ని వెలువర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. ఆడిటర్లు ఫ్లాగ్‌ చేసిన మొత్తంలో ఇప్పటివరకు 14 శాతం కంటే తక్కువ రికవరీ జరిగింది. సామాజిక తనిఖీ విభాగాలు రూ.27.5 కోట్లు దుర్వినియోగం చేశాయని ఆరోపించగా, కొన్ని కేసుల్లో చర్యలు తీసుకోవడంతో ఆ మొత్తం రూ.9.5 కోట్లకు తగ్గటం గమనార్హం. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.1.31 కోట్లు (13.8 శాతం) మాత్రమే రికవరీ అయింది.
గత ఆర్థిక సంవత్సరాల్లో కూడా రికవరీ పేలవంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఎత్తి చూపిన రూ. 86.2 కోట్లలో కేవలం రూ. 18 కోట్లు (20.8 శాతం) రికవరీ చేయబడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 171 కోట్ల విలువైన దుర్వినియోగం గుర్తించబడింది. అయితే రూ. 26 కోట్లు (15 శాతం) మాత్రమే రికవరీ చేయబడటం గమనార్హం. కాగా, పరిస్థితిని సమీక్షించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ ఈనెల ఒక రోజు సెమినార్‌ను నిర్వహించింది. సామాజిక తనిఖీ విభాగాలతో పాటు, ఉపాధి హామీ కమిషనర్లు, పౌర సమాజం, సంబంధిత వ్యక్తులు, సంస్థలూ ఇందులో భాగమయ్యాయి.
దుర్భరమైన రికవరీ రేటు ఆడిట్‌ ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదనీ, మొత్తం ప్రక్రియను నీరు గారుస్తున్నదని సోషల్‌ అకౌంటబిలిటీ ఫోరమ్‌ ఫర్‌ యాక్షన్‌ అండ్‌ రీసెర్చ్‌ (సఫర్‌)కు చెందిన రక్షిత స్వామి అన్నారు. ”రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం కోసం నిధులను నిలిపివేయడానికి కేంద్రం సామాజిక తనిఖీలు లేకపోవడాన్ని ఆయుధంగా చేసుకున్నది. రాష్ట్రాల నుంచి స్వతంత్ర ప్రతిపత్తిని కొనసాగించేందుకు సామాజిక తనిఖీ విభాగాలకు నేరుగా నిధులు ఇస్తున్న మంత్రిత్వ శాఖ నుంచి వాటికి సకాలంలో నిధులు అందడం లేదు. ఉదాహరణకు, కర్ణాటక, బీహార్‌లోని యూనిట్‌లకు దాదాపు రెండేండ్లుగా నిధులు రాలేదు”అని ఆమె అన్నారు.
పర్యవేక్షణ కరువైందని మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ వ్యవస్థాపక సభ్యుడు నిఖిల్‌ డే తెలిపారు. కాగా, గత మూడేండ్లలో గుజరాత్‌, గోవా, మేఘాలయ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో జీరో నంబర్‌ కేసులు, జీరో రికవరీ నమోదయ్యాయని ఆంగ్ల వార్త పత్రిక తన కథనంలో పేర్కొన్నది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఉపాధి హామీని నీరు గార్చే ప్రయత్నాన్ని గత కొన్నేండ్ల నుంచి కొనసాగిస్తున్నదని సామాజిక వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పథకానికి కేంద్ర బడ్జెట్‌లో తక్కువ కేటాయింపులు జరుపుతున్నదనీ, పని తీరుపై ఉద్దేశపూర్వకంగానే పర్యవేక్షణ లేకుండా అవకతవకలకు అవకాశం కల్పిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.