– మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు
– లౌకిక భారత్ కోసం దేశవ్యాప్త జాతాలు
– విలేకరుల సమావేశంలో డీవైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి భట్టాచార్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి సమస్యల పరిష్కారానికి, లౌకిక భారత్ కోసం దేశవ్యాప్త జాతాలు నిర్వహించనున్నామని డీవైఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాగరాజ్ భట్టాచార్య అన్నారు. మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) కేంద్ర కమిటి సమావేశాలు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి కేంద్ర కమిటి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండోరోజైన ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో డీివైఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాగరాజ్ భట్టాచార్య మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ని అరెస్టు చేయాలని మహిళా రెజ్లర్లు ఏప్రిల్ 17 నుంచి నిరసనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. బ్రిజ్‌భూషణ్‌తోపాటు మరో ఎంపీ సందీప్‌సింగ్‌పై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు నిరవధికంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తు న్నారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపు తున్న రెజ్లర్లను పోలిసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ రోజు బ్లాక్ డే అని అన్నారు.నూతన పార్లమెంట్ భవనాన్ని మూఢత్వాన్ని పెంపొందించేవిధంగా మోడీ ప్రారంభించారని విమర్శించారు. దేశంలో 30 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయితే ఆ పోస్టులను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకొచ్చిందన్నారు.
కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేటుపరం చేస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందన్నారు. 2014లో అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించ కుండా యువతను మోసం చేసిందన్నారు. ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ ప్రభుతాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. డీవైఎఫ్‌ఐ అధ్వర్యంలో అందరికి ఉపాధి కల్పించాలని, లౌకిక భారతదేశం కోసం దేశవ్యాప్తంగా ఆగష్టులో జాతాలను చేపట్టి యువతను జాగతం చేస్తామన్నారు. డీవైఎఫ్‌ఐ అఖిలభారత అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు రహీం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించిందని అన్నారు. దేశ రక్షణ వ్యవస్థ ప్రమాదంలో పడేవిధంగా అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ఢిల్లీ జంతర్ మంతర్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజర్లపై ప్రభుత్వం, పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తూ దాడులు చేసి, అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ అఖిలభారత కార్యదర్శివర్గ సభ్యులు జెక్ థామస్, సంజీవ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, కేంద్ర కమిటి సభ్యులు ఇర్ఫాన్‌గుల్, అనిల్, హైద్రాబాద్ జిల్లా కార్యదర్శి జావెద్ పాల్గొన్నారు.