తెలుగు సాహిత్యానికి దీప దారిగా నిలుస్తున్న ప్రామాణిక విమర్శ గ్రంథం దీపిక.అందుకే ఈ సంవత్సరం అభ్యుదయ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ రాసిన ఈ దీపిక వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అందరికీ సంతోషకరమైన విషయం.
ఆధునికతను, అభ్యుదయ సాహిత్యాన్ని వక్రీకరించినప్పుడు ఎంతటి పెద్దవారైనా నిర్మొహమాటంగా వాటిని సాధికారంగా విమర్శిస్తూ ఆధారాలతో వాస్తవాన్ని ప్రకటించే లోతైన అధ్యనం అవగాహన ఇందులో ఉంది.
అభ్యుదయ దక్పధంతో వ్రాసిన ఈ వ్యాససంపుటి తెలుగు సాహిత్య పరిణామాలను ఎక్స్‌రే తీసింది. గత వర్తమాన కాలాలలో వెలువడిన సాహిత్యాన్ని, సాహితీ సంపుటాలను కూలంకషంగా మూల్యాంకనం చేస్తూ అనేక కొత్త విషయాలను ఈ వ్యాస సంపుటిలో పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రామాణికంగా విపులీకరించారు.పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్యంగా కథా సాహిత్యంపై అపారమైన అనుభవంతో అనేక సంకలనాలను తన సంపాదకత్వంలో తీసుకువచ్చారు. కథ తీరుతెన్నులను,అవి సమాజం పట్ల బాధ్యతాయుతంగా రాయబడినవా,లేదా అనేది ఈ పుస్తకం చదివితే అర్ధమౌతుంది.ఈ పుస్తకంలో అభ్యుదయ సాహిత్య ఉద్యమ రథసారథులు రాంభట్ల కష్ణమూర్తి, సెట్టి ఈశ్వర రావు, ఆవంత్స సోమసుందర్, రెంటాల గోపాల కష్ణ, డాపపఎస్.వి. సత్యనారాయణ, ముత్యాల ప్రసాద్ లను పరిచయం చేయడమే కాకుండా వారి సాహితి సంపదను భావితరాలకు అందించే విధంగా సుసంపన్నం చేశారు. ఈ సంపుటిలో మొత్తం 36 వ్యాసాలు ఉన్నాయి.
1943లో ప్రారంభించిన అభ్యుదయ రచయితల సంఘానికన్న ముందే అభ్యుదయ సాహిత్యం ప్రారంభమైన అభ్యుదయ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఇదొక సజీవ సాహితీ స్రవంతి అని సాదాహారణంగా వివరించారు.
ప్రముఖ కవి డా.సి.నారయణ రెడ్డి గురజాడతో పాటు రాయప్రోలు సుబ్బారావును యుగకర్తలుగా పేర్కొనడాన్ని ప్రశ్నిస్తూ ఇది అకాడమిక్ కుట్ర అని,గురజాడ ఒక్కడే యుగకర్త అని,అందుకు ఎస్వీ సత్యనారాయణతో పాటు పలువురి సూత్రీకరణలు ఆధారాలుగా చూపించారు.వ్యక్తి కేంద్రమైన ప్రణయ ధర్మానికి పట్టం కట్టిన రాయప్రోలును యుగకర్త అంటూ కొందరు, ఇరువురు యువకర్తలేనంటూ ఇంకొందరు, సమాజ కేంద్రమైన ప్రజాస్వామ్య ధర్మాన్ని ప్రవచించిన గురజాడ సరసన రాయప్రోలును నిలుపపూనడం ఆయా సాహితీ వేత్తల హ్రస్వదష్టికి నిదర్శనమని ఈ సంపుటిలో పేర్కొన్నారు.ప్రముఖ కవి జాషువా మనకెప్పటికీ అవసరమే అనే వ్యాసంలో ప్రణయ వ్యాధిగ్రస్తులై ఉన్న భావకవులకు ధీటుగా జాషువా ప్రగతీశీల సాహిత్యాన్ని సష్టించారని పేర్కొన్నారు.
అక్కిరాజు రమాపతిరావు సంపాదకత్వంలో వచ్చిన తొలి మలి తరం కథా సంకలనంపై ప్రామాణికత లోపించిందని సూత్రబద్ధమైన విమర్శ చేశారు. ఈ సంకలనంలో వచ్చింది. దీనిలో 42 మంది కథా రచయితల కథలుండగా ఇద్దరు తప్ప 40 మంది బ్రాహ్మణ రచయితలేనని, అంటే ఆ కాలంలో బ్రాహ్మణ రచయితల పాత్ర తెలుసుకోవడానికి మాత్రమే దీన్ని తీసుకువచ్చినట్లు కుండబద్దలు కొట్టి మరీ ప్రకటించారు. అంతే కాకుండా 1903 లో వచ్చిన ఆచంట సాంఖ్యాయన శర్మ రాసిన అపూర్వోపన్యాసం మొదటి కథ ఎందుకు కాకూడదన్న అక్కిరాజు గారి సంశయాన్ని పటాపంచలు చేస్తూ 1902లో వచ్చిన భండారు అచ్చమాంబ ధనత్రయోదశి,స్త్రీ విద్య,తొలి తెలుగు కథ అని తేల్చి చెప్పారు.
అదే విధంగా భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు రాసిన గొల్ల రామవ్వ కథలో కాంగ్రేసు పార్టీ నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాట వీరోచిత కత్యాన్ని వివరించారని, కాని కాంగ్రేసు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నిర్వహించిందా అనే ప్రశ్న లేవనెత్తారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం 1948 సెప్టెంబర్ వరకు నైజాంపాలనకు, ఆ తర్వాత 1951లో విరమించే వరకు భారత ప్రభుత్వంపైనా కొనసాగింది. ఐతే కొన్ని గ్రామాల్లో కాంగ్రేసు పార్టీ నామమాత్రపు దళాలను కలిగి ఉండి ఒకటి రెండు దళాలు రైఫిల్ వంటి ఆయుధాలను మాత్రమే కలిగి ఉన్నాయి. ఐతే ఆ దళంలోని ఒక కాంగ్రేసు కార్యకర్త సాహసకత్యానికి రూపకల్పనే ఈ గొల్లరామవ్వ కథ అని, ఈ కథ వెల్వడకుంటే కాంగ్రేసు ఆ మేరకైనా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొన్నట్లు లోకానికి తెలిసేది కాదనే చారిత్రక వాస్తవాన్ని నిర్మొహమాటంగా చాటిచెప్పారు.
కడియాల రాంమోహన్ రారు తెలుగు సాహిత్యంపై శ్రీశ్రీ ప్రభావం అనే శీర్షికతో రాసిన పరిశోధనలోని వక్రీకరణలను ఇదేం పరిశోధన రారు గారు అని పెనుగొండ తన వ్యాసంలో ఎత్తి చూపుతూ ఆధారాలతో వాస్తవాలను ప్రకటించాడు.పెదపూడిలో అరసం నడిపిన పాఠశాలలో శ్రీశ్రీ పాల్గొనలేదనేది వాస్తవం కాదని,ఆ పాఠశాలలో పాఠాలు చెప్పిన 14 మందిలో శ్రీశ్రీ కావ్య విమర్శపై పాఠం చెప్పారని ఆధారాలతో చూపించారు. శ్రీశ్రీ ప్రభావం తెలుగు వచన రచనలపై ఉందన్న రారు వాదన కరెక్టు కాదని, ఆయన కవులను ఎంతగానో ప్రభావితం చేశారు, కాని కథకులను ప్రభావం చేసినట్లు ఏ కథకుడు చెప్పుకోలేదని తేల్చి చెప్పారు.1955 తర్వాత అరసం ఉనికిని కోల్పోయిందని,అరసాన్ని గురించి రాంమోహన రారు చేసిన వాదన సరైనది కాదని, అరసం స్థబ్దతకు గురైనా అభ్యుదయ సాహిత్య సజన ఆగలేదని, అభ్యుదయ రచయితల కార్యకలాపాలు కొనసాగాయని ఆ కాలంలో వెల్వడిన అభ్యుదయ సాహిత్యాన్ని ఇందులో విశ్లేషించారు.
తెలంగాణ విమోచనపోరాట సాహిత్యం ఆంద్రా అభ్యుదయ రచయితల సంఘీభావం అనే వ్యాసంలో అనేక ఆంధ్రాప్రాంత రచయితల సాహిత్యాన్ని ఇందులో పొందుపరిచారు. నిజాంకు వ్యతిరేకంగా,ఆ తరువాత యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా 1947 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ 21 వరకు సాగిన సాయుధ పోరాట అనేక మంది ఆంధ్రా కవుల గుండెలను మండించిందని,అందులో భాగంగానే స్పందిస్తూ అనేక కవితలు,కథలు,నవలలు,నాటకాలు రాశారని సోదాహరణంగా తెలిపారు.నవలా సాహిత్యంలో బొల్లిముంత శివరామకష్ణ మత్యుంజయులు,లక్ష్మీకాంత మోహన్ సింహగర్జన,మహిధర రామమోహన రావు ఓనమాలు,తిరునగరి రామాంజనేయులు సంఘం నవలలు తెలంగాణ సాయుధపోరాట ఉద్యమ ప్రేరణతో రాసినవేనని పేర్కొన్నారు.
కథా సాహిత్యం కూడా విరివిగా వెలువడిందని గంగినేని వెంకటేశ్వర రావు ఎర్రజెండాలు, తుమ్మల వెంకట రామయ్య కథలు, శారద కథలు విరివిగా రాశారని పేర్కొన్నారు. అడ్లూరి పిచ్చేశ్వర్ రావు, కోదండ రామ శాస్త్రీ, ఉప్పల లక్ష్మణ రావు, లక్ష్మీకాంత మోహన్, శివశంకర శాస్త్రీ, కోసరాజు శేషయ్య, తెన్నేటి సూరి,గిడుతూరి సూర్యం లాంటి అనేకమంది రచయితలు సష్టించిన తెలంగాణ సాయుధపోరాట కథాసాహిత్యాన్ని విస్తతంగా ఇందులో చూపించారు. అలాగే గేయ,వచన కవిత్వం కూడా చాలా వచ్చిందని తిరునగరి రామాంజనేయులు, పులుపుల వెంకట శివయ్య, తుమ్మల వెంకట రామయ్య, ఆవంత్స సోమసుందర్, ఆరుద్ర, గంగినేని వెంకటేశ్వర్ రావు, కారుమంచి వెంకటేశ్వర్ రావు,కుందుర్తి అంజనేయులు, టి.కష్ణ, రెంటాల గోపాల కష్ణయ్య,అనిసెట్టి సుబ్బారావు, నార్ల చిరంజీవి, లాంటి అనేకమంది కవులు కవితలు రాయడమే కాకుండా కవితా సంపుటాలను, సంకలనాలను కూడా తీసుకువచ్చారని సోదాహరణంగా వివరించారు. అదే క్రమంలో నాటక సాహిత్యం కూడా వచ్చిందని, ముఖ్యంగా సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావులు మా భూమి, ముందడుగు నాటకాలు రాశారని అవి ఎంతగానో ప్రజలను ఉద్యమోన్ముఖుల్ని చేశాయని ఇందులో వివరించారు.అంతే కాకుండా మా గోఖలే అనేక రేఖాచిత్రాలు గీసారని ఇందులో పేర్కొన్నారు.వామపక్ష పాత్రికేయులు మద్దుకూరి చంద్రశేఖర్ రావు తెలంగాణ పోరాటంపై వచ్చిన సాహిత్యాన్ని విశ్లేశించారని ఇందులో తెలిపారు.
ఉత్తమ మర్సిస్టు విమర్శకుడిగా రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి కషిని ఉన్నతంగా చూపించారు. ఇందులో వైతాళికులు కవితా సంకలనం అదొక ప్రేమగోలని విమర్శించారు. ఇంకా ఈ వ్యాస సంపుటిలో అభ్యుదయ సాహిత్యం దళిత జీవన చిత్రన అనే వ్యాసంలో దళిత సాహిత్యానికి అభ్యుదయ సాహిత్యం ఏ విధంగా తోడ్పడిందో వివరించారు.నవ్య కవిత ఝరి నయాగార,ఎస్వీ జీవితం ఒక ఉద్యమం,1932 నాటి కథావళి సంకలన పరిచయం చేశాయి. ఈ వ్యాసాలు కొత్త ఆలోచనలను రెకెత్తిస్తాయి. చర్చలకు తావిస్తాయి. సాహిత్యానికి మార్గనిర్దేశం చేస్తాయి.
– వేల్పుల నారాయణ, 9440433475