ఆన్‌లైన్‌ గేమ్స్‌తో జేబులు ఖాళీ

– వచ్చేది తక్కువ…పోయేది ఎక్కువ
– ఈ వ్యసనంతో ఆరోగ్యమూ గుల్లే
– యువత కండ్లు తెరవాలి
గతంలో సింగిల్‌ నెంబర్‌, పలు రకాల లాటరీ టిక్కెట్లు కొన్న పేద, మధ్యతరగతి బతుకులు చితికిపోయాయి. అయితే అప్పటి ప్రభుత్వాలు చొరవ తీసుకుని వాటిని నిషేధిస్తే..ఇపుడు ఆన్‌లైన్‌ గేముల పేరిట కోట్లు దండుకుంటున్నారు. చదువుకున్న యువత ఉపాధిలేక పలు వ్యవనాలకు బలి అవుతోంది ఇది చాలదన్నట్టు ఇపుడు ..చేతిలో ఉన్న ఫోన్‌యాప్‌లు కూడా వారిని వ్యసనాలకు గురిచేస్తోది. తమ వద్ద పైసలు లేకపోయినా అప్పు చేసిమరీ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. భావితరంగా చెప్పుకునే యువతను మోడీ ప్రభుత్వం భావోద్వేగ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటోంది..తమ బిడ్డల బంగారు భవితవ్యాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి గేమ్స్‌పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని తలిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ గేమ్స్‌… దేశంలోని యువత ఇప్పుడు ఈ క్రీడలకు బానిసలై పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు చాలా మందికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ జ్వరం పట్టుకుంది. దీనిని అవకాశంగా తీసుకొని కొత్త రకం ఆన్‌లైన్‌ గేమ్స్‌ పుట్టుకొచ్చి జనాల జేబులు గుల్ల చేస్తున్నాయి. ఇప్పటికే రమ్మీ, పోకర్‌, ఫాంటసీ స్పోర్ట్స్‌ వంటివి యువతను ఆకర్షిస్తుంటే ఇప్పుడు తాజాగా డ్రీమ్‌ 11, లోటస్‌ 365 అనే పేరుతో యాప్‌లు వెలిశాయి. ఈ యాప్‌లలో ప్రవేశానికి పెద్దగా ఆటంకాలు ఉండవు.. పేరుకు ఈ యాప్‌లను నియంత్రించే వ్యవస్థ ఉన్నప్పటికీ అది నామమాత్రమే. వయోబేధం లేకుండా అందరూ ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడడం మొదలెడుతున్నారు. అప్పులు చేసి మరీ డబ్బు పెడుతున్నారు. వచ్చేది తక్కువ…పోయేది ఎక్కువ. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోయి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
ఈ యాప్‌లు మనల్ని వలపన్ని లాగేస్తాయని ఐటీ పరిశ్రమలో పని చేస్తున్న అవీ చెప్పారు. ‘మరే ఇతర యాప్‌ ఇలాంటి ఉత్సుకతను కలిగించదు. నా మూర్ఖత్వం కారణంగా డబ్బు పోగొట్టుకుంటున్నాను. నా అదృష్టం బాగా లేదేమోనని సరిపెట్టుకుంటున్నా. వాస్తవానికి ఈ ఆట నన్ను తన వైపుకు లాగేస్తోంది’ అని ఆయన తెలిపారు. అప్పుడప్పుడూ ఒకసారి గెలుస్తుంటామని, అదృష్టం బాగుందని అనిపిస్తుందని, కానీ అనేక సందర్భాలలో అది కలిసి రావడం లేదని, చివరికి జేబులో డబ్బంతా పోతోందని వాపోయారు. ఫిబ్రవరికి ముందు ఆరు నెలల కాలంలో ఆయన రూ. 12 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ వ్యసనానికి బానిసలుగా మారిన వారు మేలుకొని ఉన్నా, పడుకున్నా అనుక్షణం గేమ్‌ గురించే ఆలోచిస్తుంటారు. కొందరు పోకర్‌ బాజీ యాప్‌లో పందెం కాస్తారు. పనిలో ఉన్నా అదే ధ్యాస. యాప్‌లో అప్‌డేట్స్‌ కోసం వెతుకుతూనే ఉంటారు. అవీ అయితే ఆఫీసులో పనే చేయరు. యాప్‌ పైనే రోజుకు ఎనిమిది గంటలు గడుపుతారు. తన మానసిక, శారీరక వృత్తి మొత్తం పోకర్‌…పోకర్‌…పోకర్‌ అని చెబుతారు. ఎప్పుడూ యాప్‌ గురించే ఆలోచిస్తానని, వాస్తవంలోకి రానని నిజాయితీగా ఒప్పుకుంటున్నారు..
ఫోన్‌ ఉంటే చాలు...
అవీ జీవితంలో మొదట ఏదో సరదాగా మొదలైన ఈ గేమ్‌ ఆ తర్వాత అతని ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మానవ సంబంధాలు కూడా మంటగలిశాయి. పోకర్‌ యాప్‌ గురించి ఆలోచించడం మానేస్తే చాలు…తలనెప్పి, ఆతృత మొదలవుతాయి. కుటుంబం, స్నేహితులు దూరమయ్యారు. రుణభారం, ఈఎంఐలు కలవరపెడుతున్నాయి. ఒత్తిడి కారణంగా అల్సర్‌ కూడా వచ్చింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ అనేది చాలా సులభంగా మనల్ని వలలో వేసుకుంటుంది. ఫోన్‌ చేతిలో ఉంటే చాలు…ఆ యాప్‌ ఇక ఎప్పుడూ నీ వెంట ఉన్నట్లే. బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ ఉంటే వెంటనే యాప్‌లో ప్రవేశించాలని అనిపిస్తుంది. ప్రారంభంలో మీరు గెలుస్తారు. డబ్బు బాగానే వస్తుంది. అవీ మొదట్లో రూ.80,000 గెలుచుకున్నాడు. ఆ తర్వాత రూ.60 వేలు, మళ్లీ రూ.50 వేలు…వద్దంటే డబ్బు వచ్చి ఖాతాలో పడుతోంది. అయితే అది చేతికి రాదు. మళ్లీ యాప్‌లో పెడితే ఉన్నదంతా పోతోంది. ఈ పోటీలో ఓటమి తప్పదని చివరికి జ్ఞానోదయం అయింది. అప్పటికే ఆయన ఆరోగ్యం, డబ్బు మొత్తం కనుమరుగయ్యాయి.
యాప్‌ను ఫోన్‌ నుంచి తీసేయమని స్నేహితులు ఎంతగానో చెప్పి చూశారు. అయితే ఫలితం శూన్యం. పోయిన డబ్బును తిరిగి ఎలా సంపాదించాలా అన్న ఆలోచనతో మరింత సొమ్ము పోగొట్టుకున్నారు. అయినా ఆశ చావలేదు. ఇలా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారు ఓ విధమైన మాయలో పడుతుంటారని ఆంత్రోపాలజిస్ట్‌ నటాషా చెప్పారు. చివరికి అది ఓ తీవ్ర వ్యవసగా మారి శారీరకంగా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారు ఆ గేమ్‌ను వదలరని తెలిపారు.
కుక్క తోక వంకరే
   ఇలాంటి గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ ఆడేవారు తరచుగా జూమ్‌ సమావేశాలు జరుపుతారు. వారాంతంలో రోజుకు రెండు సమావేశాలు జరుగుతాయి. ప్రతి ఆటగాడూ తాను ఏ విధంగా ఆటకు బానిస అయిందీ, ఎన్ని ఇబ్బందులు పడుతోందీ ఏకరువు పెడతాడు. ఒకడేమో స్టాక్‌ మార్కెట్‌ వలలో పడ్డానని చెబితే మరొకడేమో తన భార్య ఆభరణాలను ఎలా తాకట్టు పెట్టి ఆడిందీ చెబుతుంటాడు. ఇంకొకడు తన జీతమంతా అప్పులు తీర్చడానికే సరిపోయిందని వాపోతాడు. అయినా కుక్క తోక వంకర అన్న చందంగా మళ్లీ షరా మామూలే. ఈ సమస్య మధ్యతరగతి వారికే పరిమితం కాలేదు. ఇలా జేబులు ఖాళీ చేసుకున్న వారు చివరికి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి ఆస్పత్రుల పాలవుతున్నారు. చాలా మంది అంతా సర్వనాశనమైన తర్వాతే నిద్ర మేల్కొంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గ్యాంబ్లింగ్‌ను కొందరు వినోద కార్యక్రమంగా భావిస్తారు. వారు దానిని ఒక సమస్యగా అనుకోరని సైకాలజిస్టులు తెలిపారు.
అసలు దొంగలు సేఫ్‌
ఆన్‌లైన్‌ గేమ్స్‌ మోసాలను బట్టబయలు చేయడం కష్టమవుతోంది. చాలా యాప్‌లు యాప్‌ స్టోర్‌ లేదా ప్లే స్టోర్‌లో కన్పించవు. వీటిని వెబ్‌ బ్రౌజర్‌ నుండి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ప్రత్యేక లింకులు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో డిజిటల్‌ ప్రింటవుట్‌ను కనుక్కోవడం చాలా కష్టం. కొందరు బుకీలు ఈ యాప్‌ల ఐడీలను ఒక్కొక్కటీ వెయ్యి రూపాయలకు అమ్మి ఐదు శాతం కమిషన్‌ తీసుకుంటారు. పోలీసులు సబ్‌-బుకీలను మాత్రమే పట్టుకుంటారు. అసలు బుకీలు విదేశాలలో ఉంటారు. కొందరు సబ్‌-బుకీలు స్వయంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలై అప్పులు చేసి, అవి తీర్చడానికి ఐడీలను అమ్ముతారు.
కేంద్రం ఉదాసీనత నేపథ్యంలో ఈ ఆన్‌లైన్‌ గేమ్స్‌ను నిషేధించే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే విషయంపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. వీటిపై తీర్పులు వస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి గేమ్స్‌ బారిన పడకుండా యువతను కాపాడవచ్చు.