చెన్నై సమీపంలో ఎన్‌కౌంటర్‌..

– ఇద్దరు రౌడీషీటర్ల మృతి
చెన్నై: తమిళనాడులో ఎన్‌కౌంటర్‌ కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో చెన్నై సమీపంలోని గుడువంచేరీ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి చెందారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..గుడువంచేరీలో పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న పోలీసులు తనిఖీ నిమిత్తం ఒక ఎస్‌యూవీ ఆపేందుకు ప్రయత్నించారు. ఎస్‌యూవీలో ఉన్న నలుగురు వ్యక్తులు తమ వాహనాన్ని ఆపకపోగా.. పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢకొీట్టారు. అంతటితో ఆగకుండా వారు పోలీసులపై దాడి చేసి, బాంబు విసిరారు. ‘దాడి జరగడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. దాంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే దగ్గల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి’ అని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతులు పలు హత్య కేసుల్లో నిందితులని తెలిపారు. అలాగే మరో ఇద్దరు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గాయపడ్డారని పేర్కొన్నారు.