టెస్టులకు 2024 జనవరి ఆఖరు!

ఆసీస్‌ క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌
లండన్‌ : ఆస్ట్రేలియా డ్యాషింగ్‌ ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ కెరీర్‌లో కీలక ప్రకటన చేశాడు. రానున్న స్వదేశీ సమ్మర్‌ సీజన్‌ టెస్టు కెరీర్‌కు ఆఖరని తెలిపాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ప్రస్తుతం డెవిడ్‌ వార్నర్‌ లండన్‌లో జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు. ఐసీసీ డడ్ల్యూటీసీ ఫైనల్‌, యాషెస్‌ సవాళ్లను ఎదుర్కొంటున్న వార్నర్‌.. 2024 జనవరిలో పాకిస్థాన్‌తో చివరి టెస్టుకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నాడు. ‘ 2024 టీ20 ప్రపంచకప్‌ నా కెరీర్‌ చివరి మ్యాచ్‌కు వేదిక అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసం.. జట్టులో నిలిచేందుకు నిలకడగా పరుగులు చేయాలి. ఇంగ్లాండ్‌తో యాషెస్‌లో అవకాశం లభిస్తే పరుగులు చేయటం కీలకం. అప్పుడే స్వదేశంలో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ ఆడగలను. 2024 జనవరిలో పాకిస్థాన్‌తో సిడ్నీ టెస్టు ఐదు రోజుల ఫార్మాట్‌లో నా ఆఖరు మ్యాచ్‌. కుటుంబం, స్నేహితులు, సొంత మైదానంలో అభిమానుల నడుమ టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాలని అనుకుంటున్నాను’ అని డెవిడ్‌ వార్నర్‌ అన్నాడు.
ఒకటి కాదు మూడు కావాలి! : జూన్‌ 7-11న ది ఓవల్‌ మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడనున్నాయి. 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడగా.. టీమ్‌ ఇండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌ను నిర్ణయించే ఫైనల్‌ ఒక్క మ్యాచ్‌ కాకుండా.. మూడు మ్యాచుల మహా సమరంగా ఉండాలని డెవిడ్‌ వార్నర్‌ అభిప్రాయ పడ్డాడు. ‘తుది పోరు మూడు మ్యాచుల సిరీస్‌గా ఉండాలని నా అభిప్రాయం. రెండేండ్ల మంచి టెస్టు క్రికెట్‌ అనంతరం.. తటస్థ వేదికపై చాంపియన్‌ను తేల్చేందుకు ఒక్క మ్యాచ్‌ సరైనది కాదు. రెండు అత్యుత్తమ జట్లు, ప్రపంచ శ్రేణి బౌలింగ్‌ ఎటాక్‌తో పోటీపడటం ఆసక్తి రేపుతుంది. భారత్‌తో ఫైనల్‌ కోసం ఎదురు చూస్తున్నాను’ అని డెవిడ్‌ వార్నర్‌ తెలిపాడు.