మంత్రి ఎర్రబెల్లి హామీతో సమ్మె విరమణ

– డిమాండ్ల పరిష్కార హామీని స్వాగతిస్తున్నాం
– ఆర్ధికపరమైన డిమాండ్లపై 15 రోజుల్లో స్పష్టతివ్వాలి
– లేకుంటే మరో పోరాటానికి సిద్ధం:
తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ
– మంత్రి, ముఖ్య కార్యదర్శులకు సమ్మెవిరమణ లేఖలు అందించిన జేఏసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ మేరకు పంచాయతీ కార్మికుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. బుధవారం నుంచి కార్మికులు విధుల్లో పాల్గొంటారని తెలిపింది. సమ్మె విరమిస్తే సత్వరమే ఈఎస్‌ఐ, పీఎఫ్‌, వీక్లీ ఆఫ్‌, ఏటా రెండు యూనిఫారాలు అందజేత, పోస్టల్‌ బీమా, వారంలో ఒక రోజు సెలవు, 8 గంటల పని, తదితర హామీలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడాన్ని స్వాగతించింది. అయితే, పర్మినెంట్‌, వేతనాల పెంపు, తదితర ఆర్ధికపరమైన డిమాండ్లు, మల్టీపర్ప్‌స్‌ విధానం రద్దు వంటి వాటిపై 15 రోజుల్లో స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేసింది. లేదంటే మరోపోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించింది. సమ్మెను విరమిస్తున్నట్టు లేఖలు రాసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు అందజేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, సలహాదారులు ఎమ్‌డీ యూసుఫ్‌, కె.సూర్యం, కన్వీనర్లు పి.అరుణ్‌కుమార్‌, వెంకటరాజం, శివబాబు, ఎన్‌.దాసు, కారోబార్ల సంఘం ప్రతినిధి వి.వెంకటేశం, చాగంటి వెంకటయ్య మాట్లాడారు. 34 రోజుల సమ్మె కాలంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఒత్తిళ్లు వచ్చినా, పోలీసులు బెదిరించినా ఐక్యంగా సమ్మె చేసిన పంచాయతీ కార్మికులందరికీ అభినందనలు తెలిపారు. సమ్మెకు సహకరించిన, మద్దతు తెలిపిన ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, గ్రామకార్యదర్శులకు, మేధావులకు, పార్టీలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో అన్ని పార్టీలకు చెందిన 20 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమైనదే అని మాట్లాడటం కార్మికుల పోరాట విజయమేనన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందనీ, అందుకే మంత్రి ఎర్రబెల్లి చర్చలకు ఆహ్వానించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు నేతృత్వంలో జేఏసీతో జరిగిన చర్చల్లో ”గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో పంచాయతీ కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంది. సమ్మె విరమించండి..కొంత టైం ఇవ్వండి. దీనికి మంత్రి హరీశ్‌రావు, నేనూ బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే జేఏసీ నేతలను సీఎం దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడిస్తాం” అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారని తెలిపారు. ఆయనపై నమ్మకం ఉంచి సమ్మె విరమించాలని జేఏసీలోని కార్మిక సంఘాలన్నీ నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. గ్రామపంచాయతీ కార్మికులకు చెందిన కుటుంబాల్లో 2.5 లక్షల ఓట్లున్నాయనీ, అవి వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం 15 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మరో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. సమ్మెకు తాత్కాలికంగానే విరామం ఇస్తున్నామనీ, ప్రభుత్వం మోసం చేస్తే అదే ఆయుధాన్ని మళ్లీ ఎక్కుపెడతామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ నాయకులు పాలడుగు సుధాకర్‌, గ్యార పాండు, పి. గణపతిరెడ్డి, నర్సింహారెడ్డి, ఆర్‌కె. నాయుడు, మధుసూధన్‌రెడ్డి, వెంకట్రాములు, డి. యాదయ్య, జటంకి వెంకన్న, భాను తదితరులు పాల్గొన్నారు.