విజయంతో ముగిస్తారా?

Will it end in victory?– భారత్‌, ఇంగ్లాండ్‌ ఆఖరు టీ20 నేడు
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
భారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ తుది ఘట్టానికి చేరుకుంది. ఆతిథ్య భారత్‌ సిరీస్‌ దక్కించుకున్నా.. అభిమానుల అంచనాలకు తగ్గట్టు సిరీస్‌ సాగలేదు. భారీ స్కోర్లు నమోదవుతాయని అనుకున్న సిరీస్‌లో.. ఇప్పటివరకు 200 పరుగుల మార్క్‌ తాకలేదు. వాంఖడే సహజంగా పరుగుల పిచ్‌. ఆఖరు మ్యాచ్‌లోనైనా అసలుసిసలు ధనాధన్‌ మెరుపులు ఉంటాయా? భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదో టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-ముంబయి
ఇక్కడైనా మెరుస్తారా?
బ్యాటింగ్‌ లైనప్‌లో భారీ హిట్టర్లు సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌. ధనాధన్‌ మెరుపులకు సంజు పెట్టింది పేరు. విలక్షణ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించటంలో సూర్య దిట్ట. కానీ ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు నిరాశపరిచారు. సంజు శాంసన్‌ నాలుగు మ్యాచుల్లో 26, 5, 3, 1 పరుగులే చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 0, 12, 14, 0 పరుగులతో సరిపెట్టాడు. టాప్‌ ఆర్డర్‌లో ఈ ఇద్దరు తేలిపోవటంతో టీమ్‌ ఇండియా భారీ స్కోరు ఆశలకు గండి పడుతోంది. టాప్‌ ఆర్డర్‌లో సూర్య, సంజు మెరిస్తే వాంఖడేలో భారత్‌ అలవోకగా 200 పరుగులు చేయగలదు. అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మతో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, శివం దూబె ఫామ్‌లో ఉన్నారు. రింకు సింగ్‌ తనదైన ఇన్నింగ్స్‌ ఆడేందుకు ఎదురు చూస్తున్నాడు. అర్షదీప్‌ సింగ్‌తో కలిసి హార్దిక్‌ పాండ్య, శివం దూబె పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోరు, అక్షర్‌ పటేల్‌ త్రయం ఇంగ్లాండ్‌ను మళ్లీ మాయ చేయాలని చూస్తున్నారు. అర్షదీప్‌ సింగ్‌ స్థానంలో మహ్మద్‌ షమి తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఊరట కోసం
ఆఖరు మ్యాచ్‌ వరకు సిరీస్‌ ఫలితంపై ఉత్కంఠ ఉంటుందని అంచనా వేయగా.. ఇంగ్లాండ్‌ స్పిన్‌కు విలవిల్లాడింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై పేసర్లతో బరిలోకి దిగుతోంది. వాంఖడేలోనూ బట్లర్‌, మెక్‌కలమ్‌ ద్వయం అదే ప్రణాళిక అమలు చేయనున్నారు. పుణెలో శివం దూబె కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌పై ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. వాంఖడేలో నెగ్గితే.. నైతిక విజయం తమదేనని ఇంగ్లాండ్‌ ఊరట చెందనుంది. దీంతో బట్లర్‌ సేన నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ డకెట్‌, జోశ్‌ బట్లర్‌, లివింగ్‌స్టోన్‌, హ్యారీ బ్రూక్‌లు ఫామ్‌లో ఉన్నప్పటికీ.. సమిష్టిగా ఏ మ్యాచ్‌లోనూ మెరవటం లేదు. ఇది ఇంగ్లాండ్‌కు ప్రతికూలంగా మారింది. ఆఖరు మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు కలిసికట్టుగా రాణిస్తే ఇంగ్లీశ్‌ జట్టు గెలుపు కోసం పోరాడేందుకు వీలుంటుంది. జోఫ్రా ఆర్చర్‌, సకిబ్‌ మహమూద్‌, బ్రైడన్‌ కార్సె సహా జెమీ ఓవర్టన్‌లు పేస్‌ బాధ్యతలు చూసుకోనుండగా.. ఆదిల్‌ రషీద్‌పై స్పిన్‌ భారం పడింది.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, రింకు సింగ్‌, హార్దిక్‌ పాండ్య, శివం దూబె, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోరు, వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్‌.
ఇంగ్లాండ్‌ : ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ డకెట్‌, జోశ్‌ బట్లర్‌, హ్యారీ బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, జాకబ్‌ బెతెల్‌, బ్రైడన్‌ కార్సె, జెమీ ఓవర్టన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, సకిబ్‌ మహమూద్‌.