– నేడు మరోసారి కోర్టుకు..
– కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం
– బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరనున్న కవిత న్యాయవాదులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్స్ స్కాం మనీ లాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవితకు సంబంధించి మొత్తం పది రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో నేడు (మంగళవారం) ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ లోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించి ఈనెల 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. అనంతరం అమెను అరెస్ట్ చేసి, అదే రోజు రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. 16న సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచి, పది రోజుల కస్టడీ కోరింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం కవితకు 7 రోజుల కస్టడీ విధించింది. ఈ నెల 23తో ఆ కస్టడీ ముగియడంతో… మరోసారి కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు 5 రోజుల కస్టడీ పొడిగించాలని కోరారు. తాజాగా ఈఞీ ఈ కేసులో సాధించిన పురోగతి, కవిత మేనల్లుడు మేక శ్రీ శరణ్ పాత్రకు సంబంధించి 17 పేజీల అప్లికేషన్ దాఖలు చేసింది. ఇదే టైంలో బెయిల్ పిటిషన్ ను ఆమె తరఫు న్యాయవాది రాణా కోర్టుకు అందజేశారు. ఈడీ కస్టడీ ముగియగానే ఈ పిటిషన్‌పై వాదనలు చేపట్టాలని కోరారు. అయితే… కవితకు మరో 3 రోజుల కస్టడీని పొడిగించిన న్యాయస్థానం ఈరోజు (మంగళవారం) ఉదయం 11 గంటల లోపు తమ ముందు హాజరుపరచాలని ఈడీకి ఆదేశించింది. కవితను ప్రవేశపెట్టే సమయంలో ఆమె కస్టడీ పొడిగించాలని ఈడీ మరోసారి కోరనున్నట్టు సమాచారం. ఒకవేళ కస్టడీ పొడిగింపునకు కోర్టు అనుమతించకపోతే… కవిత బెయిల్ పిటిషన్ పై ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నట్టు తెలిసింది.