– అంగన్‌వాడీల సదస్సులో నాయకుల డిమాండ్
అమరావతి : సమగ్రశిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్) ప్రారంభమై 50 ఏండ్లయిన సందర్భంగా దేశ పురోభివృద్ధికి ఎంతో కీలకమైన ఐసిడిఎస్ పథకం సర్ణోత్సవాలు సంవత్సరమంతా నిర్వహించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటి నిర్ణయించింది. యూనియన్ రాష్ట్ర సదస్సు విజయవాడలోని ఎంబివికెలో శనివారం ప్రారంభమైంది. అంగన్‌వాడీల 42 రోజుల సమ్మె విరమణ సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని, మిని సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సదస్సులో భాగంగా తొలిరోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన అనంతరం ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూవస్తున్నారని తప్పుబట్టారు. ఫ్రీ స్కూళ్లను దెబ్బతీయడానికి నూతన విద్యా విధానాన్ని అమల్జేస్తున్నారని తెలిపారు. ఐసిడిఎస్ లక్ష్యానికి తూట్లు పొడిచే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంలో కార్మికులు, ఉద్యోగుల ప్రస్తావనే లేదని, వీరు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. మరోవైపు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని, 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకువచ్చారని చెప్పారు. మరోవైపు దేశాన్ని పురాతన సమాజం వైపు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ఉపందుకున్నాయని తెలిపారు. అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని అమలు చేసేందుకు బిజెపి జమిలీ ఎన్నికలను తీసుకువచ్చిందని, ప్రాంతీయ పార్టీలు వాళ్ల స్వార్ధం కోసం దీనికి మద్దతు ఇస్తున్నాయన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.నరసింగరావు కార్మికల సమస్యలపై సిఐటియు నిర్వహించిన పోరాటాలు, యూనియన్ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా 42 రోజుల సమ్మెకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. సదస్సులో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, అన్ని జిల్లా కమిటీల బాధ్యులు, తదితరులు హాజరయ్యారు.