బ్రీత్‌ అనలైజర్‌ చట్టాన్ని అమలు చేయండి

– టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులు మద్యం సేవించారా, లేదా అని బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్ష చేసినపుడు మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 185 ప్రకారం చర్యలు తీసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) యాజమాన్యాన్ని డిమాండ్‌ చేసింది. పై చట్టం ప్రకారం 30 మిల్లీ గ్రాములు (ఎమ్‌జీ) లేదా వంద మిల్లీలీటర్లు (ఎమ్‌ఎల్‌) దాటిన కేసుల్లో మాత్రమే పనిష్మెంట్‌ ఇవ్వాలని తెలిపారు. అందుకు భిన్నంగా ఒక ఎమ్‌జీ వచ్చినా సస్పెండ్‌ చేసే విధానాన్ని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. 2015లో లా డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసిన సర్క్యూలర్‌ను సవరించి ఉద్యోగ భద్రత కల్పించాలని శనివారం ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌, జాయింట్‌ డైరెక్టర్‌, సీనియర్‌ లా ఆఫీసర్‌కు వినతిపత్రాలు ఇచ్చినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు తెలిపారు. హౌమియో మాత్రలు వాడిన వారిని పరీక్ష చేయగా 350-550 ఎమ్‌జీ/100 ఎమ్‌ఎల్‌ వచ్చినట్లే, మెంతోప్లస్‌, జర్దాపాన్‌, పాన్‌పరాగ్‌, మింట్‌, పిప్పర్‌మెంట్‌, దగ్గుమందు త్రాగిన వారిని పరీక్ష చేయగా 4 ఎమ్‌జీ నుంచి 12 ఎమ్‌జీ వరకు వచ్చినట్టు గమనించారని తెలిపారు. ప్రయివేటు ఆపరేటర్లు కూడా బస్సులు నడుపుతున్నారనీ, వారికి ఇలాంటి పరీక్షలు ఏమీ లేవని వివరించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.