– ఆశావర్కర్ల హామీలను విస్మరించిన సర్కారు
– కళ్యాణలక్ష్మికి తులం బంగారం మరిచారు…
– తీవ్ర నిరాశ పరిచిన మధ్యంతర బడ్జెట్ : కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రస్తావన మధ్యంతర బడ్జెట్‌లో లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం శాసన మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే తప్ప…గేమ్ ఛేంజింగ్ ప్రభుత్వమనేది కాదని ఎద్దేవా చేశారు. ఆ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామంటున్నదే తప్ప.. ప్రగతి గేర్లను మార్చడం లేదని విమర్శించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున అందించేదని గుర్తుచేశారు. దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. బడ్జెట్‌లో దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా.. కనీసం ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల జీతాలను రూ.18 వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చినా బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. దీనిపై ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ దారి చూపిస్తుందని భావించామనీ, కానీ అన్ని వర్గాలను మధ్యంతర బడ్జెట్ నిరాశపరిచిందని తెలిపారు. కేటాయింపులు ముఖ్యం కాదనీ, ప్రభుత్వ ధృక్పథాన్ని ఈ బడ్జెట్ సూచిస్తున్నదని చెప్పారు.