– మొదటి రోజు 56,674 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
– రేపటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరానికిగాను 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. మొదటి రోజు 56,674 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. శనివారం ఆరు నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని వివరించారు. ఈనెల ఎనిమిది నుంచి 15 వరకు వెబ్‌ఆ ప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. అదేనెల 19న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. అభ్య ర్థులు ఇతర వివరాల కోసం www.://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.