నేటినుంచి ఇంజినీరింగ్‌ స్పాట్‌ అడ్మిషన్లు

– 30 నుంచి 2 వరకు కాలేజీల్లో ప్రవేశాలు : ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లకు బుధవారం నుంచి స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎప్‌సెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేజీలు, బ్రాంచ్‌ల వారీగా ఖాళీ సీట్ల వివరాలను https.://tgeapcet.nic.in  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బుధవారం కాలేజీలు ఖాళీ సీట్ల భర్తీ కోసం స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరారు. గురువారం పత్రికల్లో నోటిఫికేషన్‌ను జారీ చేయాలని సూచించారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. అదేనెల మూడున స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా చేరిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అదేనెల నాలుగో తేదీ నాటికి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థుల వివరాలతోపాటు హార్డ్‌ కాపీని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న సాంకేతిక విద్యాభవన్‌, ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. స్పాట్‌ అడ్మిషన్ల వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 86,943 సీట్లున్నాయి. ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ తర్వాత 75,107 (86.4 శాతం) మందికి సీట్లు కేటాయించారు. కన్వీనర్‌ కోటాలో ఇంకా 11,836 (13.6 శాతం) సీట్లు మిగిలాయి.