ఇంగ్లాండ్‌, ఆసీస్‌కు స్లో ఓవర్‌ రేట్‌ వ్యథ!

Slow over rate problem for England and Aussie!– వరుసగా 19, 10 పాయింట్ల కోత పెట్టిన ఐసీసీ
దుబాయ్ : ఆధునిక క్రికెట్‌లో 2023 యాషెస్‌ సిరీస్‌ అత్యుత్తమం అని క్రికెట్‌ పండితులు అంటున్నారు. ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఐదు టెస్టుల సిరీస్‌ 2-2తో సమంగా ముగిసింది. యాషెస్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన ఆనందం ఇరు జట్లలోనూ ఎంతోసేపు నిలువలేదు. స్లో ఓవర్‌ రేట్‌ రూల్స్‌ ప్రకారం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాపై ఐసీసీ కొరడా ఝులిపించింది. నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్‌ రేట్‌కు ఇంగ్లాండ్‌కు 19 పాయింట్లు, ఓ టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌కు ఆస్ట్రేలియాకు 10 పాయింట్ల కోత విధించింది. ఐసీసీ నూతన రూల్స్‌ ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌కు ప్రతి ఓవర్‌కు ఓ పాయింట్‌, 5 శాతం మ్యాచ్‌ ఫీజు కోత విధిస్తారు. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు ఓవర్లు, లార్డ్స్‌లో 9 ఓవర్లు, మాంచెస్టర్‌లో మూడు ఓవర్లు, ది ఓవల్‌లో ఐదు ఓవర్లు ఇంగ్లాండ్‌ వెనుకంజలో నిలువగా.. మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియా ఏకంగా పది ఓవర్లు వెనుకంజ వేసింది. దీంతో యాషెస్‌ సిరీస్‌లో ఇరు జట్లు రెండు విజయాలు, ఓ డ్రాతో 28 పాయింట్లు సాధించగా.. ఇంగ్లాండ్‌ 19 పాయింట్లు, ఆసీస్‌ 10 పాయింట్లు కోల్పోయింది. మ్యాచ్‌ ఫీజులో ఆసీస్‌ ఆటగాళ్లు 50 శాతం కోల్పోగా.. ఇంగ్లాండ్‌ క్రికెటర్లు వరుసగా 10, 45, 15, 25 శాతం కోల్పోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ ఖాతాలో 9 పాయింట్లు, ఆస్ట్రేలియా ఖాతాలో 18 పాయింట్లు ఉన్నాయి.