దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘లక్కీ భాస్కర్’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో సిద్ధమవు తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేసింది. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘శ్రీమతి గారు’ అనే తొలి పాటను చిత్ర బందం బుధవారం విడుదల చేసింది.
జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. వయోలిన్‌తో మొదలై, ఫ్లూట్ మెలోడీగా మారి, డ్రమ్ బీట్‌లతో మరో స్థాయికి వెళ్లి.. జి.వి. ప్రకాష్ కుమార్ ప్రత్యేక శైలిలో ఎంతో అందంగా సాగింది ఈ పాట. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు.
గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం, ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు’ అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు. కోపగించుకున్న భార్య పట్ల భర్త తన వాత్సల్యాన్ని తెలుపుతూ ”చామంతి నవ్వు”, ”పలుకే ఓ వెన్నపూస” వంటి పదబంధాలను ఉపయోగిస్తూ, గాఢమైన ప్రేమను వ్యక్తీకరించారు.
దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రం ‘సార్’లో స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్, గాయని శ్వేతా మోహన్ కలయికలో వచ్చిన ‘మాస్టారు మాస్టారు’ గీతం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ ‘శ్రీమతి గారు’ గీతం కూడా ఆ స్థాయి విజయాన్ని సాధించి, ప్రేక్షకుల హదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు అని చెబుతోంది చిత్ర బృందం.
1980-90 కాలంలో అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.