ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. ఆసాంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని అర్థం అవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు. హర్ష చెముడు మాట్లాడుతూ, ‘మా లాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవికి థ్యాంక్స్. సినిమా చాలా కొత్త పాయింట్‌తో రాబోతోంది. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. అందరినీ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది’ అని చెప్పారు. ‘ఈ సినిమా కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. ట్రైబల్ విలేజ్‌లో అందరూ ఇంగ్లీష్ అంత ఫ్లూయోంట్‌గా ఎలా మాట్లాడుతారు అనే దానికి ఓ కారణం ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుంది’ అని డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ అన్నారు. నిర్మాత సుధీర్ కుమార్ మాట్లాడుతూ, ‘రవితేజతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాను. సినిమా చూశాను. మూవీ చాలా బాగా వచ్చింది’ అని అన్నారు.