చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘యేవమ్’. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రకాష్ దంతులూరి మీడియాతో ముచ్చటించారు.
వైజయంతీ మూవీస్‌లో చేసిన ‘ఓంశాంతి’ నా తొలి సినిమా. ఈ తర్వాత ఈ కథ, కాన్సెప్టు నచ్చి నవదీప్ ఈ సినిమాకు నిర్మాతగా మారారు. ‘యేవమ్’ అనేది సంస్కృత పదం, ఇతిహాసాలు, పురాణాలు చెప్పినప్పుడు ఇది ఇలా జరిగింది అని చెప్పడాన్ని ‘యేవమ్’ అంటారు. ఈ సినిమాలోని పాత్రలు రియల్ లైఫ్ పాత్రల్లా ఉంటాయి. నలుగురు విభిన్నమైన వ్యక్తుల కథ ఇది. వంశీ ‘అన్వేషణ’ లాంటి థ్రిల్లర్‌ను మనకు తెలిసిన పాత్రలతో చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. అయితే ఇది పోలీసాఫీసర్ కథ అయినా చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. పత్రి పాత్ర కూడా ఎంతో యూనిక్‌గా ఉంటుంది. సినిమా మొత్తం సీరియస్ మూడ్‌లో ఉండదు. ప్రతి సన్నివేశాన్ని ఆడియన్స్ ఎంజారు చేస్తారు. నేటి సమాజంలోని వ్యక్తులను చూసి రాసుకున్న పాత్రలే ఇవి. ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలను చేధించడానికి వాళ్లు పడే స్ట్రగుల్ ఈ కథ.
ఈ చిత్రంలో ఓ అమ్మాయి తను అనుకున్న గోల్‌ను ఎలా చేరుకుంది? అనేది ఎంతో ఆస్తకికరంగా, ఎంటర్టైనింగ్గా వుంటుంది. సౌమ్య పాత్రలో చాందిని చౌదరి లీనమైపోయింది. ప్రతి సన్నివేశం బాగా చేసింది. ఆమెకు నటిగా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. ఈ సినిమాకు ఫీమేల్ సంగీత దర్శకురాలు నేపథ్య సంగీతం అందించింది. చాలా బాగా చెసింది. నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్స్ చెబుతుంది. ఇది థియేటర్లో చూడదగ్గ సినిమా. ఇది కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది.