రఘు హాల్లో కూర్చుని సత్య తీసుకొచ్చిన టీ తాగుతున్నాడు. ఆడుకోవటానికి బయటికి వెళ్ళిన చింటూగాడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. తండ్రి దగ్గర కూచున్నాడు.
”పరివార్ అంటే ఏంటి డాడి?” అడిగాడు చింటూ.
”పరివార్ అంటే కుటుంబం అంటే ఫ్యామిలీ అన్నమాట”! అన్నాడు రఘు.
”పరివార్ అంటూ ఆట బందుచేసి ఇంటికి వచ్చావు! డౌటు ఎందుకు వచ్చిందిరా?” అడిగింది సత్య.
”నా ఫ్రెండ్ వాళ్ళ డాడి, మాది మోడీ పరివార్ అంటూ ఎవరికో చెబుతున్నాడు!’ అందుకే డౌటు వచ్చి అడుగుతున్నాను”. అన్నాడు చింటూ.
”నీకు డౌటే అవసరం లేదు! మనది కూడా మోడీ పరివార్ అని పదిమందికీ గర్వంగా చెప్పురా!” అన్నాడు రఘు గర్వంగా ఛాతీ విరుచుకుని.
”ఓకే డాడీ! కాని ఫ్యామిలీ అంటే ఏమిటీ డాడీ?” మళ్లీ అడిగాడు చింటూ.
”చూశావా! నా మోడీ అన్న ఒక్క మాటతో మన సంస్కృతి ఏమిటో తర్వాత తరానికి కూడా తెలిసే అవకాశం వచ్చింది!” అన్నాడు రఘు మరింత గర్వంగా.
”అది సరే! ముందు మీ కుమార రత్నం అనుమానాలు నివృత్తి చేయండి! అన్నది సత్య నవ్వుతూ.
”సరే! ఈ దెబ్బకి చింటుగాడు మన సంస్కృతి మొత్తం ఔపోసన పట్టేస్తాడు చూడు! పరివార్ అంటే ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఒకపెద్ద ఉంటాడు. ఆ కుటుంబ పెద్ద, ఆ కుటుంబానికి కావల్సినవన్నీ తెచ్చి పెడుతుం టాడు. ఆ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే, కుటుంబ పెద్ద ఆదుకుంటాడు!” అని వివరించాడు రఘు.
”అంటే నీలాగా అన్నమాట! కదూ డాడీ!” అన్నాడు చింటూ తండ్రిని చూస్తూ గర్వంగా.
”రఘు షర్టు బిగ్గర అయ్యి, ఒక గుండీ తెగిపోయింది. కొడుకును దగ్గరకు తీసుకుని జేబులోంచి పెద్ద చాక్‌లెట్ తీసి ఇచ్చాడు.
”కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులందరినీ సమానంగా చూస్తాడు. కుటుంబ సభ్యులంతా సమానమే తేడాలేమీ ఉండవు!.కుటుంబ సభ్యులు ఒకరికోసం మరొకరు నిలబడతారు! ఇదీ పరివార్ అంటే! మోడీ మన కుటుంబ పెద్దలా అన్నీ చూసుకుంటున్నాడు. కనుక ఆయనే మన కుటుంబ పెద్ద! మనమంతా ఆయన పరివారం! అన్నమాట! అర్థమైందా?” అన్నాడు రఘు.
”మోడీ పరివార్‌లో మనమూ, మా ఫ్రెండ్ వాళ్లేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? డాడీ!” అడిగాడు చింటూ.
”మోడీ అంటే ఎవరనుకున్నావురా? విశ్వగురు! ఈ భారతదేశంలోని ప్రజలంతా ఆయన పరివారమే! అంటే భారతీయులంతా మోడీ పరివార్ అన్నమాట!” అన్నాడు రఘు గర్వాన్ని అలానే మెయింటెన్ చేస్తూ!.
”అంటే మన కుటుంబపెద్ద మోడీ మనదేశంలో ఎవరికీ ఏ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాడన్న మాట అంతేనా డాడీ!” అడిగాడు చింటూ.
”అది ముమ్మాటికీ నిజం! మోడీ ఉన్నాడు కాబట్టి! మన దేశం ఉంది! మనమంతా ఉన్నాం! ఆయన లేకపోతే మనమంతా పాకిస్తాన్ లేదా చైనాలో కలిసిపోయే వారం!” అన్నాడు రఘు మరింత గర్వంగా.
”ఓహో! అలాగా! అయితే పక్కింటి శేఖరన్న ఎంఏ చదివి ఉద్యోగం రావటం లేదని, మిర్చిబండి పెట్టుకున్నాడంట! మన కుటుంబ పెద్ద మోడీ తాత, శేఖరన్నకు ఉద్యోగం ఇప్పించొచ్చుకదా!” అడిగాడు చింటూ.
”ప్రభుత్వ ఉద్యోగం రాసిపెట్టి ఉండాలి. లేకపోతే రాదు! అయినా మిర్చిబండి పెట్టుకోవటం కూడా ఉద్యోగమేలే!” అన్నాడు రఘు.
”అదన్నమాట సంగతి! మరి మణిపూర్‌లో అక్కలను రేప్ చేసి రోడ్లమీద బట్టలు లేకుండా నడిపించారంట! వారికి ఇంతవరకూ మోడీ తాత హెల్ప్ చేయలేదంట! కనీసం ఫోన్ కూడా చేయలేదంట! మణిపూర్ అక్కలు మోడీ పరివార్‌లో లేరా డాడీ! అడిగాడు చింటూ.
మణిపూర్ గురించి నీకెవరు చెప్పార్రా!” పళ్ళు కొరుకుతూ అన్నాడు రఘు.
”అమ్మ చెప్పిది డాడీ!” అన్నాడు చింటూ.
”మీ అమ్మకేం పనిలేదు! అందుకే అట్లా చెబుతుంది! మోడీ తాత బాగా బిజీగా ఉన్నాడు అందుకే మణిపూర్ వెళ్ళలేదు!” అన్నాడు రఘు పళ్లు కొరుకుతూనే.
”సరే! మరి తాము పండించిన పంటకు ధర పెంచమని ఫార్మర్ అంకుల్స్ ఢిల్లీకి పోతుంటే, పోలీసులు రైతులను కొట్టారట! ఆ పోలీసులను, మన దేశానికి మోడీ తాత ఎందుకు రానిచ్చాడు డాడీ! తాతకు తెలియకుండా వచ్చారా? అనుమానంగా అడిగాడు చింటూ.
”ఆ పోలీసులు కూడా మోడీ పరివారమే!” అన్నది సత్య నవ్వుతూ.
”అలాంటి పోలీసులను మోడీ తాత పరివారంలో నుండి బయటకు ఎందుకు పంపలేదు డాడీ!” తండ్రిని ప్రశ్నించాడు చింటూ.
చింటూ గాడి ప్రశ్నకు రఘు బిత్తరపోయాడు. ఏం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ చూశాడు.
”అంటే తన పరివారంలోని రైతు అంకుల్స్‌ను పోలీసుల చేత మోడీ తాతే కొట్టించాడన్న మాట! ఇదేం బాలేదు డాడీ!” అన్నాడు చింటూ సీరియస్‌గా.
రఘు ఏదో చెప్పబోయాడు!
”సరే డాడీ! మన ఇంటిలో నీకు ఇన్‌కంటాక్స్ బాగా కట్ అయ్యిందని అమ్మతో నిన్న రాత్రి చెప్పావు కదా! మరి మోడీ తాత తన పరివారంలోని సభ్యులకు ఇన్‌కంటాక్స్‌లో ఎందుకు ఫేవర్ చేయటం లేదు. చెప్పు డాడీ!” అన్నాడు చింటూ ఇంకా సీరియస్‌గా.
చింటూ గాడి ప్రశ్నకి రఘు మైండ్ బ్లాంక్ అయ్యింది! ”నిజమే గత పదేండ్లు తనలాంటి చిరుద్యోగులకు ఇన్‌కంటాక్స్ స్లాబు పెంచలేదు! ఏదో చిన్న చిన్న మార్పులు చేసిన పాత స్లాబులే ఇంకా కొనసాగుతున్నాయి. పదేండ్లకి ఇప్పటికీ ఆదాయం పెరిగిన మాట నిజమే! కాని ఆదాయానికి నాలుగు రెట్లు ఖర్చులు పెరిగాయి! పన్ను స్లాబును, పరిమితిని కొంతైనా పెంచితే తనకు తనలాంటి వారికి వెసులుబాటు వచ్చేది! ధర్మం కోసం భరించటం ఎంతకాలం సాధ్యపడుతుంది! భరించినా దాని వల్ల ఏమీ ప్రయోజనం లేదు! కదా!” అనుకున్నాడు రఘు.
”మరో డౌటు డాడీ!” అన్నాడు చింటూ
అడుగమన్నట్లు చూశాడు రఘు.
”మోడీ తాత గత పదేండ్లలో లక్షకోట్ల అప్పు చేశాడంట కదా!” అన్నాడు చింటూ.
”అవును చేశాడు!” అన్నాడు రఘు.
”మరి అంత పెద్ద అప్పు చేసి, ఒక ఫ్యాక్టరీ కట్టలేదు! శేఖరన్న లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు! ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదు! ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయలేదు! ఒక్క పార్లమెంటు మాత్రమే కట్టారంట! దానికే లక్షకోట్లు ఖర్చు అయ్యిందా డాడీ? అడిగాడు.
”ఇందంతా ఎవరు చెప్పారు?” బేలగా అడిగాడు రఘు.
”అమ్మ చెప్పింది! నిజమా కాదా నీవు చెప్పు!” అడిగాడు చింటూ.
”నిజమే!” అన్నట్లు తలాడించాడు రఘు.
”ఛీ! ఛీ! ఇదేం పరివారం డాడీ! తన కుటుంబ సభ్యుల మంచీ చెడ్డలు చూడకుండా వారి కష్టాలు పట్టించు కోకుండా, వారి కోసం ఏమీ చేయకుండా, మోడీ పరివార్ అని చెప్పుకోవటం ఎందుకు? ఇలాంటి పరివారంలో నీవు, నేనూ, అమ్మా ఎందుకుండాలి? అమ్మ అలిగినా, నేను అలిగినా, నీవు మమ్మల్ని బుజ్జగించి, మేము అన్నం తినేవరకు నీవు కూడా తినవు! నీకు కొత్త డ్రెస్ కొనకున్నా మాకు మాత్రం కొత్త డ్రెస్సులు తెచ్చి పెడతావు! మాకు కొంచెం ఫీవర్ వచ్చినా, వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళతావు! కుటుంబ పెద్ద అంటే నీలా ఉండాలి! కానీ మోడీ తాతలా ఉండొద్దు! అందుకే మనం మోడీకా పరివార్ కాదు!” అంటూనే చింటుగాడు బయటికి వెళ్ళాడు.
రఘు, సత్యా ఆందోళనగా బయటకు వెళ్లి చూశారు!
అప్పటికే చింటూగాడు గేటు మీద రాసేశాడు!
”మేము మోడీ పరివార్ కాదు!”
-ఉషాకిరణ్