నవతెలంగాణ – భీంగల్
వర్షాకాలము నీటి నిలువ పై దోమల లార్వాలు అభివృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికిన్గునియా, ఫైలేరియాసిస్ వంటి కీటక జనిత వ్యాధులు సంభవించే అవకాశం ఉందని కనుక ప్రతి ఒక్కరు తమ ఇల్లు పరిసరాల్లో నీటి విలువ లేకుండా చూసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అజయ్ పవర్ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీజనల్ మార్పు వలన కలుషిత నీరు తాగడం వల్ల నీళ్ళ వీరేచనాల వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలని వీలైనంత వరకు బయట ఆహారం తీసుకోకూడదని తెలియజేశారు. వర్షాల వల్ల నిలువ ఉన్న నీటిపై దోమలు గుడ్లు పెట్టేందుకు ఆవాసాలుగా మారుతాయి అని ఒకవేళ వాటిని తొలగించకపోతే దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులు కలిగిస్తాయని ఆయన వివరించారు. వయోజనులకు బీసీజీ టీకా వేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో క్షయ వ్యాధితో బాధపడిన వారు, ప్రస్తుతము క్షయ వ్యాధి యొక్క కాంటాక్ట్ లు, 60 సంవత్సరాల వయసు మించిన వృద్ధులు, తీవ్ర పోషకాహార లోపం కలవారు, ప్రస్తుత లేదా గత పొగ త్రాగే అలవాటు గలవారు మరియు మధుమేహం చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు ఈ టీకాకు అర్హులని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వసంత్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ కటకం శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీమతి భూలక్ష్మి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.