పాలమూరుకు-రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు

– రాజకీయ శ్రేణుల్లో కదలిక
– ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో రాజకీయ శ్రేణుల్లో హడావిడి ప్రారంభమైంది. తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం కీలకమని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ప్రభుత్వంపై ఉండేవి. తాజాగా ఇచ్చిన అనుమతులతో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో కదలిక వచ్చినట్టయింది. శుక్రవారం ఇటు మహబూబ్‌నగర్‌, ఇటు రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తోటి ప్రజాప్రతినిధులతో కలిసి ఆ ప్రాజెక్టు పనులు జరుగుతున్న చోట సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. అలాగే రంగారెడ్డిలో మంత్రి సబితారెడ్డి సైతం ఆనందం ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ మాత్రమే ఈ ప్రాజెక్టును నిర్మించగలరని వ్యాఖ్యానించారు. దాదాపు 12.38 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ఆయా జిల్లాల పరిధిలోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించడం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం. 2016లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్ల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకే ఈ పనులు చేపట్టారు.నాలుగు లిఫ్టులు, ఐదు జలాశయాల ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌ను సరఫరా చేయనున్నారు. రూ. 55,086.57 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పటికే తొలిదశ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రెండో పనులు తాజా పర్యావరణ అనుమతులతో వేగాన్ని పుంజుకోనున్నట్టు సాగునీటిశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. తాజా ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ఎజెండాగా వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ఈ ప్రయత్నాలు చేస్తున్నది.