ప్లాస్టిక్‌తో పర్యావరణ సంక్షోభం

        ప్రపంచం 50ఏండ్లుగా ప్రపంచ పర్యావరణ దినాన్ని జరుపు కుంటున్నది. పర్యావరణ చైతన్యాన్ని ప్రజల్లో నింపే కార్యక్రమ 50వ వార్షికోత్సవాన్ని జూన్‌ 5న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కోట్‌ డెల్‌వాయిర్‌లో జరుపుకోబోతున్నాం. పుడమి, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మొదలైన ఈ చైతన్యయాత్ర గత 50ఏండ్లలో ఏం సాధించిందీ, పర్యావరణం ఏ మేరకు మెరుగైందీ సమీక్షించుకునే సందర్భం కూడా ఇది. మెరుగుదల మాట అటుంచి పర్యావరణం పెనం మీది నుండి పొయ్యిలోకి పడినట్టుగా తయారయింది. ప్రపంచం ఇప్పుడు మూడు సంక్షోభాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వాతావరణ మార్పు పెను సంక్షోభానికి తోడు ప్రకృతి జీవవైవిధ్యం కనుమరుగు కావటం, కాలుష్యం – వ్యర్థాలు పడగవిప్పటంతో చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి తలెత్తింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా ఐక్యరాజ్యసమితి పేర్కొన్న ఏ ఒక్క లక్ష్యమూ గడపదాటని స్థితి. భూగోళం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న వాతావరణ మార్పును నిరోధించే కీలక ‘క్లైమేట్‌ చర్యలు’ తీసుకోవడానికి మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. ప్రపంచ దేశాలు మరీ ముఖ్యం గా కాలుష్యపు పొగబెట్టి ప్రపంచాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిన అమెరికా వంటి ధనికదేశాలు వాతావరణ మార్పునకు కారణమైన హరిత గృహ వాయువుల నియంత్రణకు పెట్రోలు ఉత్పత్తుల వినియోగానికి అడ్డుకట్టవేయడానికి అంగీక రించడం లేదు. ఈ నేపథ్యంలో తక్షణం పర్యావరణాన్ని కాపాడే ‘క్లైమేట్‌ చర్యలు’ చేపట్టాలనే అత్యవసర డిమాండ్‌తో ఈ పర్యావరణ దినం జరుపుకోవలసి ఉంది.
ప్లాస్టిక్‌ కాలుష్యానికి స్వస్తి చెప్పేందుకు కాలుష్య నివారణ మార్గాలపై కేంద్రీకరించాలని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. ప్లాస్టిక్‌ కాలుష్యానికీ వాతావరణ మార్పుకూ మధ్య విడదీయలేని బంధం ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్‌ పెట్రోలియం ఉత్పత్తి. ఇది పెట్రోలియం సహజవాయువుల నుండి తయారవుతుంది అంటే ప్లాస్టిక్‌ ఉత్పత్తి వాతావరణ మార్పును మరింత వేగిర పరుస్తుంది. ప్లాస్టిక్‌ను కాల్చటం వలన ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ భూమ్మీద ప్రతి మనిషి రోజుకు 50వేలకు పైగా ప్లాస్టిక్‌ రేణువులను తెలియకుండానే తినేస్తున్నాడు. ఇంకా ఎన్ని శ్వాసిస్తున్నాడో అంచనా లేదు. ఇదంతా ప్రధానంగా మనం ఒకేసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ తెస్తున్న అనర్థం. వాడిపడేసే ప్లాస్టిక్‌ సంచులు మొదలు వాటితో చెరువులు, నదులతో పాటు సముద్రాలు కూడా కాలుష్య కాసారాలయ్యాయి. ఇదిలాగే పెచ్చుమీరితే 2050 నాటికి మన సముద్రాల్లో చేపలకు బదులు ప్లాస్టిక్‌ వ్యర్థాలుంటాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పును అదుపులో పెట్టడంలో సముద్రాలు మనకు సహజ మిత్రులు. భూ ఉపరితలం నుండి వెలువడే సీఓ2ను తనలో ఇముడ్చుకునే శక్తి సముద్రాలకుంది. సముద్రాల్లో నివసించే మొక్కలు, జంతువులకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు మరణశాసనం రాస్తున్నాయి. ప్రపంచంలోనే అన్నింటికంటే ఎత్తైన పర్వతం ఎవరెస్టు సముద్రంలో అత్యంతలైతన ప్రాంతం మరియానా ట్రెంచ్‌ అని కూడా తెలిసిందే. ఇక్కడికి చేరుకోవటం ఎంత కష్టమో చెప్పనవసరం లేదు. కాని ఇక్కడ కూడా చిన్న ప్లాస్టిక్‌ ముక్కలున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కాని ఇది వాస్తవం. కాలుష్య రక్కసి విశ్వరూపానికి ఇవి కొన్ని ఉదాహరణలు. మన మారుమూల పల్లెల్లో నుంచి నీళ్లు దొరకవేమో గాని కోకోకోలా, పెప్సికోలా వంటి శీతల పానీయాలు తేలిగ్గా దొరుకుతాయి. ఒక్క కోకోకోలా కంపెనీకే నిముషానికి రెండు లక్షల ప్లాస్టిక్‌ సీసాలు తయారు చేస్తోందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్‌ కాలుష్యం గురించి మరీ ఇంతగా భయపడటమెందుకంటే ఇవి మట్టిలో కలిసిపోవు. వందల సంవత్సరాలు ఏ జీవికీ లొంగకుండా నేలపొరల్లో నిలిచిపోతాయి. ఒక ప్లాస్టిక్‌ కప్పు 50 సంవత్సరాలు వాడేసి ప్లాస్టిక్‌ రుమాలు 450 సంవత్సరాలు కరగదంటే నమ్మగలరా! సముద్ర ఆవరణ వ్యవస్థ మరో ఇరవై సంవత్సరాలలో కుప్పకూలిపోతుందని గ్లోబల్‌ సముద్ర పర్యావరణ సర్వే అంచనా వేసింది. ప్లాస్టిక్‌ ఉత్పత్తిని 55శాతానికి తగ్గించాలని నిపుణుల సూచన. వాడిన వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చే పనికి ఆయా కంపెనీలు బాధ్యత వహించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టటం అవసరం. వాడిన ప్లాస్టిక్‌ను తిరిగి ఇస్తే వారికి డబ్బిస్తామంటే కొన్నవాళ్లే జాగ్రత్తగా తిరిగి ఇస్తారు. మనదేశంలో ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో స్వల్ప భాగమే పునర్వినియోగానికి వచ్చి దాదాపు 85శాతం వ్యర్థాలుగా పర్యావరణంలోకి చేరుకుంటున్నది. అన్ని పరిశ్రమలు 2030 నాటికి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను కాలుష్య రహితంగా, విషపదార్థలు విడుదల చేయకుండా రీసైకిల్‌ చేయాలి. కార్పొరేట్‌ల సామాజిక బాధ్యత అంటే అదే కదా! ఇన్ని అనర్థాలకూ మూలం మనం ఎంచుకున్న అభివృద్ధి నమానాలోనే ఉంది. సమాజ క్షేమం, భూగోళం ఉనికి కంటే అభివృద్ధి ముఖ్యం కాదు. పర్యావరణ పరిరక్షణ రాజకీయ పార్టీల ఎజెండాలోకి వచ్చేలా పర్యావరణ ఉద్యమాలతో ఒత్తిడి తేవాల్సి ఉంది.
ప్రొ|| కట్టా సత్యప్రసాద్‌