– రెండోసారి ఎందుకు పెట్టారుొ ప్రభావిత గ్రామాలకు నష్ట పరిహారం ఇవ్వాలి : జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను మళ్లీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయం సేకరణ జరిగింది. ఇందులో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఏర్పాటు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, ఆ సమయంలో విదేశీ బొగ్గు వాడుతామని చెప్పారని, దానివల్ల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కాలుష్యం, ప్రాణాపాయం ఉండదని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు స్వదేశీ బొగ్గును వాడేందుకు చూస్తున్నారని, దీనిపై న్యాయస్థా నానికి వెళ్లడం వల్ల మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెప్పారు. ఎందుకు స్వదేశీ బొగ్గు వాడుతున్నారో, మాట మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. ప్లాంటు నిర్మాణం సమయంలో 40శాతం గ్రీనరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఒక్క మొక్క కూడా నాటలేదని చెప్పారు. ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని.. ఇప్పుడు గ్రీనరీ లేక, చెట్లు లేక గాలి, నీరు కలుషితమవుతున్నాయని.. దాని ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట పూర్తిగా దిగుబడి తగ్గిపోయిందని తెలిపారు.ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ముంపునకు గురవుతున్న నర్సాపురం, వాడపల్లి, మరికొన్ని గ్రామాలను కూడా బాధిత గ్రామాలుగా చేర్చి అక్కడి రైతులకు పరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. ప్రాజెక్టు ప్రభావితం చూపే ప్రాంతం వరకు అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.రంగారెడ్డి మాట్లాడే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.