– డిపిఓ ఓంటేరు దేవరాజు
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర దృష్ట్యా, ముందస్తుగా పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ములుగు జిల్లా పంచాయతీరాజ్ అధికారి (డిపిఓ) ఓంటేరు దేవరాజ్ ప్రత్యేక శ్రద్ధతో స్థానిక పంచాయతీ కార్యదర్శి కొర్నేబెల్లి సతీష్ ప్రతిరోజు దగ్గరుండి విధులు నిర్వహిస్తున్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మినీ జాతర కు భక్తులు ముందస్తుగానే అధిక సంఖ్యలో వస్తున్నారు. మేడారం మినీ జాతరకు ముందస్తుగానే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు తరలిరాగా సమయంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఓ మేడారం పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా పారిశుధ్య పనులను చేపట్టారు. గద్దెల ప్రాంగణం, గద్దెల పరిసరాలు, శివరాంసాగర్‌చెరువు, ఆర్టీసీ బస్టాండ్, మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, నార్లాపురం, కొత్తూరు, పడిగాపురం, చింతల్ క్రాస్ తదితర గ్రామాల్లో చెత్తాచెదారం తొలగిస్తున్నారు. భక్తులు వదిలివేసిన వ్యర్థాలు, ప్లాస్టిక్‌కవర్లు, ఆహార పదార్థాలను ట్రాక్టర్లలో ఎత్తి డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. మేడారం పరిసర గ్రామాల్లో దుర్వాసన రాకుండా బ్లీచింగ్‌పౌడర్‌ను చల్లుతున్నారు. గద్దెల వద్ద అపరిశుభ్రంగా ఉన్న ప్రాంగణాన్ని నీటితో కడిగిస్తూ ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నారు. కాగా మొదట జిల్లా పంచాయతీరాజ్ అధికారి (డిపిఓ) వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజులకు పసుపు కుంకుమ చీర సారె సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు.