ప‌ర్యా‌వ‌ర‌ణ హితం క్లీ‌న్ ఎన‌ర్జీ‌

Environmentally friendly clean energyఇంజనీరింగ్‌ చేరే సమయంలోనే తన ఆసక్తికి తగినట్టు పారిశ్రామిక ఇంజనీరింగ్‌ ఎంపిక చేసుకుంది. యూఎస్‌లో మాస్టర్స్‌ చేసేటపుడు క్లీన్‌ ఎనర్జీపై అవగాహన పెంచుకుంది. పర్యావణానికి మేలు చేసే ఈ రంగాన్నే తన కెరీర్‌గా మలుచు కుంది. తర్వాత మహిళా పారిశ్రామికవేత్తగా మారి సోలార్‌ సొల్యూషన్స్‌తో నగరాన్ని వెలిగిస్తోంది. ఆమే రాధిక చౌదరి. 2014లో ఫ్రెయర్‌ ఎనర్జీ ప్రారంభించి వేల ఇండ్లకు, వ్యాపార సంస్థలకు పర్యావరణ రహితమైన క్లీన్‌ ఎనర్జీతో వెలుగులు నింపుతున్న హైదరాబాద్‌ యువతి పరిచయం నేటి మానవిలో…
2011లో రాధిక ఒక పార్టీలో తన భర్త స్నేహితుడు సౌరభ్‌ మర్దాను కలిసినప్పుడు వారి మాటల సందర్భంలో క్లీన్‌ ఎనర్జీ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీరైన మార్దా క్లీన్‌ ఎనర్జీ రంగంలో వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటున్న సమయం అది. అప్పటికే రాధికకు ఈ రంగంలో విస్తృతమైన అనుభవం ఉంది. మూడేండ్ల తర్వాత ఇద్దరూ కలిసి ఫ్రెయర్‌ ఎనర్జీని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది హైదరాబాద్‌లోని గృహాలు, వ్యాపార సంస్థలకు సోలార్‌ సొల్యూషన్‌లను అందిస్తుంది. ‘మేము ఇళ్లు, కంపెనీలకు వారి విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి రూఫ్‌టాప్‌ సోలార్‌ సొల్యూషన్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వాటిని శుభ్రమైన, సరసమైన, నమ్మదగిన సౌరశక్తికి యాక్సెస్‌తో శక్తివంతం చేయాలనుకుంటున్నాం’ అని రాధిక అంటున్నారు.
సౌరశక్తితో ప్రయాణం
ఇంటర్‌ తర్వాత రాధికకు ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివే అవకాశం వచ్చింది. అయితే ఆ ఫీల్డ్‌ తనకు సరిపోదని భావించారు. దానికి బదులుగా తన ఆసక్తికి తగినట్టు, సామర్థ్యాలను పెంచుకునేందుకు పారిశ్రామిక ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. యూఎస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చేసే సమయంలో ఆమె సౌరశక్తితో నడిచే ఇంధన కణాలపై పరిశోధన ప్రాజెక్ట్‌లో పనిచేశారు. ఇదే క్లీన్‌ ఎనర్జీ రంగంలో ఆమెలో ఆసక్తిని రేకెత్తించింది. అదే సమయంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంధన రంగంపై సమాజం ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. ఆమె GE ఎనర్జీలో పవన శక్తిపై సోర్సింగ్‌, ఇంజినీరింగ్‌ ఇంటర్న్‌గా పనిచేసే రంగాన్ని ఎంచుకున్నారు.
లోతైన అవగాహన
ఆమె SKF USA Inc, Lanco Wind Power Pvt Ltdతో సహా పలు ప్రదేశాలలో పవన శక్తి పరిశ్రమలో ఎంతో పనిచేశారు. 2008లో లాంకో విండ్‌ పవర్‌ ఆమెకు యూఎస్‌ నుండి తిరిగి వచ్చి దక్షిణ భారతదేశం అంతటా పని చేసే అవకాశాన్ని కల్పించింది. హైదరాబాద్‌లో పని చేస్తునపుడు మాంద్యం కారణంగా కంపెనీ మూసివేశారు. దాంతో ఆమె సోలార్‌ విభాగానికి మారారు. కొన్నేండ్ల తర్వాత ఓ సోలార్‌ ఎనర్జీ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో చేరారు. 2014లో సొంత వ్యాపారం ప్రారంభించే వరకు అక్కడే పనిచేశారు. ‘విదేశాలతో పాటు భారతదేశంలో పని చేసిన అనుభవం క్లీన్‌ ఎనర్జీ మార్కెట్‌ గురించి నాకు లోతైన అవగాహన ఇచ్చింది. ఈ అభ్యాసం నా స్టార్టప్‌లో నాకు చాలా సహాయపడింది’ అని ఆమె జతచేస్తున్నారు.
జ్వలించే మార్పు
ఫ్రెయర్‌ ఎనర్జీ నివాస, వాణిజ్య భవనాల కోసం సౌర వ్యవస్థలను అందిస్తుంది. కంపెనీ అవసరమైన నిర్వహణ సౌకర్యాలను కూడా అందిస్తుంది. సాధారణంగా ఒక ఇంటికి 2-10 kW మధ్య అవసరమవుతుంది. అయితే స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటి అదనపు సౌకర్యాలుంటే 20 kW నుండి 30 kW వరకు పెరుగుతుందని రాధిక వివరించారు. అవసరమైన ప్యానెల్‌ల సంఖ్య విద్యుత్‌ వినియోగం, సూర్యకాంతితో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఎదురయ్యే సవాళ్లు
రాధిక సోలార్‌ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు దానిపై అవగాహన తక్కువ. సౌరశక్తి వినియోగం గురించి ప్రజలను ఒప్పించడం చాలా సవాలుగా ఉండేదని ఆమె గుర్తుచేసుకున్నారు. పైగా ఇది కొత్త రంగం కాబట్టి బ్యాంకులు కూడా సహకరించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ పర్యావరణంపై ప్రజలకున్న అవగాహన ద్వారా సౌరశక్తి వ్యవస్థల గురించి అర్థమయ్యేలా చెప్పేవారు. కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌, వాటర్‌ (CEEW) నివేదిక ప్రకారం భారతదేశంలోని 250 మిలియన్లకు పైగా గృహాలు 637 గిగావాట్ల (GW) సౌర సామర్థ్యాన్ని వ్యవస్థాపించగలవు. డిసెంబర్‌ 2023 నాటికి 11.08 (GW) వ్యవస్థాపించబడింది.
నైపుణ్యం ఉన్నపుడు
సాధారణంగా ఈ రంగంలో పురుషులే ఎక్కువగా నాయకత్వం వహిస్తారు. కానీ తన కంపెనీకి రాధికనే నాయకురాలు. ‘మీకు సరైన జ్ఞానం, నైపుణ్యం ఉన్నప్పుడు ఇతరులు మీ సామర్థ్యాలను గ్రహించే విషయంలో లింగం ప్రభావితం చేయదని నేను నమ్ముతున్నాను’ అని ఆమె జతచేస్తున్నారు. మహిళా వ్యాపారవేత్తలు తమ కంపెనీని సమర్థవంతంగా నడిపించాలంటే వ్యాపారానికి సంబంధించిన అన్ని అంశాల గురించి తెలుసుకోవాలని ఆమె సూచించారు. సవాళ్లు వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, వాటిని చూసి భయపడి పారిపోవద్దుని ప్రోత్సహిస్తున్నారు.
ఫైనాన్షియల్‌ కంపెనీలతో…
కంపెనీ వెబ్‌సైట్‌లోని కాలిక్యులేటర్‌ ప్రకారం నెలవారీ కరెంట్‌ బిల్లు రూ. 2,500 వస్తుంటే 3 కిలోవాట్ల సోలార్‌ వ్యవస్థను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీని వల్ల ఏడాదికి రూ. 30,000 ఆదా చేసుకోవచ్చు. 60కి పైగా మెగావాట్ల సౌర సామర్థ్యంతో ఫ్రెయర్‌్‌ ఎనర్జీ గృహాలు, వ్యాపార సంస్థలు ఏడాదికి 9.12 లక్షల కంటే ఎక్కువ యూనిట్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతోంది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం కంపెనీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి అని రాధిక అంటున్నారు. ‘చాలా మంది ఇంత ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండరు. దాంతో సోలర్‌ పట్ల ఆసక్తి ఉండేది కాదు. అలాంటి వారికి ఈఎంఐ అందించడానికి బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలతో మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ సౌకర్యంతో రూఫ్‌టాప్‌ సోలార్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం’ అని రాధిక చెప్పారు.