చుక్కలు చూపిస్తున్న ఈపీఎఫ్‌ఓ

EPFO showing dots– చిన్న చిన్న కారణాలతో క్లెయిముల తిరస్కరణ
– ప్రతి మూడింటిలో ఒక దానికి అదే గతి
– ప్రతి ఏటా పెరుగుతున్న సంఖ్య
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. తుది పరిష్కార క్లెయిము కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఖాతాదారులకు చుక్కలు చూపుతోంది. చిన్న చిన్న కారణాలు చెబుతూ వారి దరఖాస్తులను తిరస్కరిస్తోంది. ఈ విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారుల పరిష్కార క్లెయిముల్లో మూదో వంతు దరఖాస్తులను ఈపీఎఫ్‌ఓ తిరస్కరించింది. ప్రతి మూడు క్లెయిములలో ఒకటి లేదా 34% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తంలో తుది పరిష్కార క్లెయిములను ఈపీఎఫ్‌ఓ తిరస్కరిస్తున్న ఉదంతాలు గత ఐదు సంవత్సరాల కాలంలో పెరిగాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 18% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈపీఎఫ్‌ఓలో 29 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. వీరిలో 6.8 కోట్ల మంది క్రియాశీలక ఖాతాదారులు. ఈ సంస్థకు రూ.78,00,000 కోట్ల కార్పస్‌ నిధి ఉంది. ఏదైనా కంపెనీలో కనీసం 20 మంది ఉద్యోగులు ఉండి, వారు నెలకు రూ.15 వేల కనీస జీతం పొందుతూ ఉంటే ఆ కంపెనీ తన ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలు తప్పనిసరిగా తెరవాలి. ఉద్యోగి మూల వేతనంలో కనీసం 12% మినహాయించి, దానిని పీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలి. యజమాని కూడా అంతే మొత్తంలో ఆ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారుల తుది పరిష్కార క్లయిముల్లో 18.2% దరఖాస్తులను ఈపీఎఫ్‌ఓ తిరస్కరించింది. ఈ తిరస్కరణలు 2019-20లో 24.1%, 2020-21లో 30.8%, 2021-22లో 35.5%కి పెరిగాయి. తిరస్కరణల సంఖ్య పెరగడంపై సంస్థ పాలక మండలి పలు దఫాలుగా చర్చించింది. ఖాతాదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడం మొదలు పెట్టిన తర్వాత తిరస్కరణలు పెరిగాయని ఓ అధికారి తెలిపారు. చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి వీటిని తోసిపుచ్చుతున్నారు. ఉదాహరణకు ఈ నెల 7న కేరళలోని త్రిస్సూర్‌లో ఓ టైర్ల తయారీ కంపెనీలో పనిచేసి పదవీ విరమణ చేసిన పి.శివరామన్‌ అనే వ్యక్తి కొచ్చిలోని ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈపీఎఫ్‌ఓలో ఉన్న రికార్డులకు, శివరామన్‌ సమర్పించిన పత్రాలకు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉండడంతో ఆయన క్లెయిమ్‌ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. తొమ్మిది సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ప్రయత్నించినా ఆయనకు ఈపీఎఫ్‌ఓ నుండి సొమ్ము అందలేదు. దీంతో ఆయన విసిగి వేసారి ఆ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఈపీఎఫ్‌ఓను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని తెలిపింది. కాలపరిమితికి లోబడి 99% క్లెయిములను పరిష్కరిస్తున్నామని చెప్పింది. 2022-23లో ఐదు కోట్ల క్లెయిములను ప్రాసెస్‌ చేశామని, రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని వివరించింది. తుది పరిష్కారం, పీఫ్‌ బదిలీ, పీఎఫ్‌ నిధుల పాక్షిక ఉపసంహరణ కోసం 5.21 కోట్ల క్లెయిములు రాగా వాటిలో 1.34 కోట్లు తిరస్కరణకు గురి కాగా 3.77 కోట్లు పరిష్కారమయ్యాయి.