‘పెన్షన్ దయా దాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు. పెన్షన్ పొందటం ప్రాథమిక హక్కు’ అని సుప్రీంకోర్టు కూడా తీర్పు నిచ్చింది. వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం, సమాజ అభివృద్ధికి జీవితాంతం సేవలందించిన కార్మికులు పెన్షన్ పొందడం అనేది ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు వృద్ధాప్యంలో పెన్షన్ చెల్లించడం అనేది కనీస బాధ్యత. కానీ భారతదేశంలో తన కార్మికులకు, వృద్ధాప్యంలో రక్షణ కల్పించడానికి సంబంధించి ఎలాంటి సామాజిక భద్రతా వ్యవస్థ లేదు. సామాజిక భద్రతను విస్తరించి మెరుగుపరచి అందరికీ వర్తింప జేయడానికి బదులుగా పింఛన్ ప్రయోజనాన్ని ఎత్తివేసి దాని ప్రయోజనాన్ని కుదించడానికి ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాల కనుగుణంగా పనిచేస్తున్నవి. ఉద్యోగులు, కార్మికులు కష్టపడి పోరాడి సాధించుకున్న పెన్షన్ హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నవి. కార్మికులకు సంబంధించిన సొమ్మును భవిష్యనిధి నుండి ఫించన్ ఫండ్‌కు బదిలీ చేస్తున్నారు. యజమానులు ప్రావిడెంట్ ఫండ్‌లోని పెన్షన్ ఫండ్ ఖాతాకు వారి వాటాను బదిలీ చేయడం అనేది వాస్తవంగా జరగటం లేదు.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్-95 (ఈపిఎస్) ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ నుండి అమలు ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ప్రభుత్వేతర సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు మొదలైన వివిధ వర్గాల ప్రజలకు వర్తింప జేస్తూ అనేక పెన్షన్ పథకాలున్నాయి. ఈ పథకాలన్నీ చాలా తక్కువమందికి కవర్ అవుతున్నాయి. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం కార్మికవర్గంలో కేవలం 12శాతం మందికి మాత్రమే వర్తిస్తున్నాయి. 2020 నేషనల్ కమిషన్ ఆఫ్ పాపులేషన్ రిపోర్టు ప్రకారం 2022 మార్చి నాటికి సుమారు 30కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్‌లో సభ్యులుగా ఉంటారని అంచనగా వేయగా, సగటున 4.6కోట్ల మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈపిఎస్-95 కింద దాదాపు 75లక్షల మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. కానీ తక్కువ ఆదాయం కలిగిన ప్రావిడెంట్ ఫండ్‌దారులకు మాత్రమే పెన్షన్ చెల్లించబడుతోంది. నెలకు రూ.15వేలకన్నా అధికంగా సంపాదిస్తున కార్మికులకు పెన్షన్ చెల్లించుట లేదు. ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఈపిఎస్-95 కింద పరిమిత ప్రయోజనాలను కూడా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను విధించే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారీ నిరసనల నేపథ్యంలో దానిని ఉపసంహ రించుకున్నది. కార్మికులు వారి కుటుంబ అవసరాల కోసం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోని వారి సొంత సొమ్మును ఉపసంహరించుకోకూడదని కూడా నిర్ణయించింది. కార్మికుల నుండి తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ నిర్ణయాన్ని కూడా ఉపసంహ రించుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ, 15శాతం వాటాను షేర్ మార్కెట్‌లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ వాటాను మరింత పెంచాలని కూడా యోచిస్తోంది. ప్రావిడెంట్ ఫండ్‌తో పాటు అన్ని పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గించి వాటిలోని నిధులను షేర్ మార్కెట్టుకు తరలించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రావిడెంట్ ఫండ్‌తో పాటు 1952 సామాజిక భద్రతా చట్టాలను, నిబంధనలను రద్దు చేసి ఒకే లేబర్ కోడ్ కిందకు తీసుకొనివచ్చింది. యజమానుల, కార్మికుల వాటాను ప్రస్తుతం ఉన్న 12శాతం నుండి 10శాతం తగ్గించాలని సూచించింది. కార్మికుడు కనుక తన వాటాను పదిశాతం కన్నా ఎక్కువ చెల్లించాలని కోరుకుంటే అభ్యంతరం లేదు. కానీ యజమాని మాత్రం 10శాతం కన్నా ఎక్కువ చెల్లించనవసరం లేదు. ఆవిధంగా యజమానులు ప్రావిడెంట్ ఫండ్ చట్ట పరిధిలోనే వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడబెట్టుకోవచ్చు. అంతేకాక అనేక సంస్థల్లో పనిచేసే కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ కింద కవర్ కాకుండా నష్టపోతారు. తద్వారా ఆయా సంస్థల యజమానులు అధికంగా లాభం పొందుతారు. ఉద్యోగి, యజమాని అంగీకరిస్తే, ప్రావిడెంట్ ఫండ్, ఈపిఎస్-95 వాటాను వేతన పరిమితికి మించి లేక పూర్తి వేతనాన్ని కూడా జమ చేయవచ్చు. అయితే ఈ నిబంధన 2014 వరకు మాత్రమే ఉంది. ఎవరైతే కార్మికుడు పూర్తి వేతనాన్ని తన వాటాను చెల్లించినా కూడా, అధిక పెన్షన్‌ను ఆ కార్మికుడికి చెల్లించబడలేదు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కార్మికులకు కొంత ఉపశమనం కలిగించే తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల వలన తీర్పు స్ఫూర్తితో అమలు చేయబడలేదు. ఆ విధంగా ఉత్తర్వులనిచ్చి కేంద్ర ప్రభుత్వం తన అనాసక్తిని బయటపెట్టుకుంది.
ఆ విధంగా ఈపిఎస్-95 అమలు అనేది హాస్యాస్పదంగా మారింది. నేటికీ లక్షలాది మంది కార్మికులు అతి తక్కువ పెన్షన్ పొందుతున్నారు. కనీస అర్హత కలిగిన, అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ పొందుట అనేది అందని ద్రాక్షగా మారింది. కనీస పెన్షన్‌ను రూ.9వేలు అనే డిమాండ్‌కు మద్దతు విస్తృతంగా రావడంతో, అప్పటి యూపీఏ-2, ప్రభుత్వం కనీస పెన్షన్ రూ.వెయ్యికి పెంచాలని నిర్ణయం చేసింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ దాన్ని అమలు చేసింది. కానీ, పెన్షన్ సాధ్యమైనంత మేరకు తక్కువగా ఉండే విధంగా షరతులతో కూడిన ఫార్ములాను రూపొందించి అమలు చేసింది. అనేక ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల సంఘాలు, పోరాటాలు, ఆందోళనలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెన్షన్‌లో పెంపుదల లేకుండా, నేటికీ అనేకమంది పెన్షనర్లు కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ 4 నవంబర్ 2022న ఈపిఎస్-95 పెన్షన్‌పై సుప్రీంకోర్టు తీర్పు స్పూర్తికి విరుద్ధంగా ఉత్తర్వులిచ్చింది. తీర్పులోని ఒకే ఒక అంశానికి ఈ ఉత్తర్వులు పరిమితమైంది. పెన్షనర్స్‌లోని ఒక చిన్న విభాగానికి మాత్రమే, అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆ విధంగా అతి తక్కువ పెన్షన్ పొందే అనేక మంది పేద పెన్షనర్లకు అధిక పెన్షన్ పొందే అర్హత లేకుండా తిరస్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తిని, ఉద్దేశ్యాన్ని నీరు కార్చింది.
సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌ను అమలు చేయుటకు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్‌కు ఎనిమిది వారాల గడువు అనగా 29 డిసెంబర్ 2022 వరకు సమయం ఇచ్చింది. సాధారణంగా కార్మికులు ప్రత్యేకించి పెన్షనర్ల పట్ల ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ యొక్క ఉదాసీన వైఖరికి ఇది పూర్తిగా అద్దం పడుతోంది. ఈ ప్రభుత్వ ఉత్తర్వు పెన్షనర్లకు, ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు మార్గనిర్దేశనం చేయడం కన్నా సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయడం నుంచి తప్పించుకోనుటకు ఉద్దేశించిందిగా అనిపిస్తుంది. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన సమయంలో చివరి తేదీని ఎంచుకొని ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నిజానికి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఉద్దేశ్యపూర్వకంగా, పెన్షనర్ల ఇష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం చేకూర్చే విధంగా రెండు నెలల గడువును పెంచింది. ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్‌కు గనుక చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఈ ఉత్తర్వులను రెండు నెలల ముందే ఇచ్చి ఉండేవారు. పెన్షన్ లబ్ధిదారులందరూ రెండు నెలలలోపు అధిక పెన్షన్ ఎంపిక చేసుకొనుటకు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో త్వరపడాల్సిన అవసరం ఏర్పడింది. అటువంటి తాజా ఎంపికను చేసుకుంటునప్పుడు, సంబంధిత రికార్డులు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ వద్ద అందు బాటులో ఉన్నప్పటికీ రికార్డులు సమర్పించే, బాధ్యతను పెన్షనర్స్‌పై నెట్టి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఆ బాధ్యత నుండి తప్పించుకొనుటకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులుగా వేతన పరిమితి రూ.5వేలు లేదా రూ.6,500లు మించి జీతంపై జమచేసిన పెన్షనర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపిఎస్-95లో సభ్యులు, ముందస్తు సవరణ పథకం ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఉమ్మడి ఎంపికను ఉపయోగించుకున్నారు. అటువంటి వారి ఎంపికను ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ తిరస్కరించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, యజమానుల నుండి శాసన, ప్రభుత్వ ఆర్థికపరమైన చర్యలు అవసరం. అవేంటంటే కనీస పెన్షన్ పెంపు, దాని అమలు కోసం కేంద్రం బడ్జెట్‌ను కేటాయించడం చేయాలి. ఈపిఎస్-95 కోసం యజమాని, ప్రభుత్వ వాటాల పెరుగుదల, 50 ఏండ్లు నిండకముందే పెన్షన్ చెల్లింపు, ధరల పెరుగుదలకనుగుణంగా పదవీ విరమణ వయసును 58 నుండి 60కు పెంచే అవసరాన్ని గుర్తించాలి. కనీస పెన్షన్ నెలకు రూ.9వేలకు తక్కువ కాకుండా నిర్ణయించడం లాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే అంత ఈజీగా కేంద్రం చేయదు. ఎందుకంటే ఫెన్షన్‌ను హక్కుగా కాకుండా భిక్షగానే వారు అమలు చేస్తున్నారు. ఈపీఎస్- 95పై సుప్రీం తీర్పును కేంద్రం అమలు చేయాలంటే దశలవారి ఆందోళనల ద్వారానే సాధ్యం.
ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్
9490300867