– సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాలరాజు
– కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె
– మండల కేంద్రంలో ర్యాలీ, మానవహారం
నవతెలంగాణ-కందుకూరు
అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు, ఆయాలకు రూ.20 వేలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాలరాజు అన్నారు. కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె మంగళవారం రెండోవ రోజుకు చేరింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. శ్రీశైలం హైదరాబాద్, ప్రధాన జాతీయ రహదారిపై అంగన్‌వాడీ టీచర్లు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్ ఏర్పడి 48 ఏండ్లు గడుస్తున్నా, అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైదన్నారు. కేరళ రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.26 వేలు ఇస్తున్నారని వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీస వేతనం అమలు చేసి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, రూ.10 లక్షల బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకూ సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు షాజహాన్, సుమతి, గోవిందమ్మ, యశోద, వనజ, బాలమణి, శైలజ ,స్వరూప, కవిత, స్వాతి, రాధిక, ఆయలు లక్ష్మి ,స్వరూప, జ్యోతి ,అరుణ ,జయమ్మ, పద్మ ,లక్ష్మమ్మ పాల్గొన్నారు.