కాంగ్రెస్ తోనే సకల జనులకు సమన్యాయం

– కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి

– ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న కసిరెడ్డి 
– నియోజకవర్గం లోని ఎలికట్ట, వెంకటాపూర్ లో గడప గడపకు కాంగ్రెస్
– కసిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న అభిమానులు, వివిధ పార్టీల నాయకులు
నవతెలంగాణ- ఆమనగల్
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ తోనే సకల జనులకు సమన్యాయం సాధ్యమవుతుందని కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అధిష్టానం కసిరెడ్డి నారాయణరెడ్డిని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆయన తన అనుచరులతో కలిసి రెట్టింపు ఉత్సాహంతో ఇంటింటి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఎలికట్ట, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్ తదితరులు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కసిరెడ్డి, బాలాజీ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ పూటకో పథకంతో ప్రజలను మభ్యపెట్తున్న ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. వాస్తవాలు గుర్తించిన ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా వెల్దండ మండలం గొల్లోనిపల్లి గ్రామానికి పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు ఎం.డి.ఫరీద్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్ తదితరులు కసిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.