దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమన్యాయం..

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు
– విజయవంతంగా ముగిసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు
నవతెలంగాణ – ధర్మసాగర్ 
దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్ లో రెండు రోజుల పాటు కొనసాగిన సీపీఐ జిల్లా స్థాయి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. నాడు యూపిఎ హయాంలో వామపక్షాల మద్దతు ఉండడం వల్లనే నాడు ఉపాధి హామీ, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం తీసికొని వచ్చారని అన్నారు. దేశంలో గడిచిన పదేళ్ల పాలనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ఒక్కటీ కూడా ప్రజలకు ఉపయోగ పడే సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. దేశ ప్రజల సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడి దారులకు, బడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేశారని అన్నారు. మతం, కులం పేరుతో ప్రజలను విడదీసి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని, రాముని పేరుతో రాజకీయాలు నెరిపిందని అన్నారు. అయినప్పటికీ దేశ ప్రజలు గత లోక్ సభ ఎన్నికలలో మోడీ మత రాజకీయాలను తిరస్కరించి గుణపాఠం చెప్పారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు బీజేపీ మత రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజల కోసం పోరాటం చేసే కమ్యూనిస్టులను ఆదరించాలని కోరారు. శిక్షణా తరగతుల ద్వారా పొందిన చైతన్యంతో సీపీఐ కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ ముగింపు కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అద్యక్షత వహించగా శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్ గా ఆదరి శ్రీనివాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు కర్రె లక్ష్మణ్, ఉట్కూరి రాములు, మునిగాల బిక్షపతి, జక్కు రాజు గౌడ్, వేల్పుల సారంగపాణి, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, మాలోతు శంకర్, ధర్ముల రామ్మూర్తి, బట్టు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాజకీయ శిక్షణా తరగతులు
రెండు రోజుల పాటు జరిగిన సీపీఐ జిల్లా శిక్షణా తరగతులు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసాయి. రెండవ రోజు శిక్షణా తరగతులలో భారత రాజ్యాంగం- లౌకిక వాద పరిరక్షణ పై రిటైర్డ్ ప్రొఫెసర్ మార్క శంకర్ నారాయణ బోధించగా, కులం, మతం – మతోన్మాదంపై ఏఐటీయూసి రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ బోధించారు.