సమానత్వం, సామాజిక న్యాయం: అంబేద్కర్‌వాదం

Equality, Social Justice: Ambedkarismఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక మత ప్రచారకుడిలా మాట్లాడారు. హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.హిందువులు ఐక్యంగా లేరని, అసమానతలతో ఉన్నారని మోడీ అంగీకరించారు. సామాజిక అంతరాలు తొలగిపోవడానికి ఐక్యం కావలన్నారా? అగ్రవర్ణ హిందువులను ఐక్యం చేస్తారా?అణగారిన వర్గాల హిందువులను ఐక్యం చేస్తారా? తేల్చిచెప్పాలి. ‘మనమంతా హిందువులం.. గంగాజల బిందువులం.. బంధువులం’ అని ఆరెస్సెస్‌ నిరంతరం వల్లేవేస్తున్నది. ఒకే కులంలోపుట్టిన వాళ్లు మాత్రమే బంధువులు అవుతున్నారు.వేర్వేరు కులాల వాళ్లు స్నేహి తులు మాత్రమే అవుతున్నారు. దేశంలో 6486 కులాల వాళ్లు అందరూ హిందువులే కదా అన్ని కులాలను రద్దుచేసి ఒకే కులం పెట్టగలిగితే హిందువు లంతా ఏకమవుతారు కదా? ఒకే కులానికి ఒప్పుకుంటారా? స్వకుల వివాహ పద్ధతిని తిరస్కరించి కులరహిత పెళ్లిళ్లకు ప్రధాని మోడీ పార్లమెంట్‌లో బిల్లుపెట్టి చట్టం చేస్తారా? దాని ద్వారా మాత్రమే హిందువులు ఐక్యం కాగలరు.ఇలాంటి ఐక్యతకు ఆరెస్సెస్‌- బీజేపీ సిద్ధమవుతుందా? అనేది ప్రధాన ప్రశ్న.
పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ భారత రాజ్యాంగ గ్రంథాన్ని కండ్లకు అద్దుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని తమపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.కానీ గత పదేండ్ల కాలంలో మోడీ సర్కారు రాజ్యాంగాన్ని రద్దు చేయకుండానే దాని మౌలిక లక్ష్యాలను పాతాళంలోకి తొక్కేసింది. ‘మనుస్కృ‌తి మా పవిత్ర ప్రాచీన రాజ్యాంగం’ అని ఆరెస్సెస్‌ కార్యకర్త కృష్ణారెడ్డి ఒక గ్రంథం రాశారు. దాన్ని 2022 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌ తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ప్రస్తుత బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ బాజాప్త భారత రాజ్యాంగంలో లౌకికవాదం అనే పేరును తొలగిస్తామని చెప్పారు. బీజేపీ విధానం రాజ్యాంగ రక్షణే అయితే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మూడువేల ఏండ్లుగా మనుస్కృ‌తి దుష్ట ఫలితాలవల్ల మన దేశంలో మెజార్టీ హిందువులు చదువు, సంపద, ఆస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, అధికారా లు నిషేధించబడ్డాయి. వాటిని ఎలా సరిదిద్దగలరో చెప్పగలరా? మెజార్టీ హిందు వులు ఈ అసమానతలు ఎందుకు అనుభవిస్తున్నారో వివరించగలరా?75 ఏండ్ల భారత రాజ్యాంగం తర్వాత కూడా నేటికీ సంపూర్ణ అక్షరాస్యత ఎందుకు సాధించలేక పోయాం? ఎందుకు నిలువ నీడ లేక లక్షలాది మంది పేదలు పట్టణాల్లో గుడిసెలు వేసుకుంటున్నారు? సమాధానం చెప్పగలరా?
77 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఒక్క ముస్లిం, ఒక్క క్రైస్తవుడు ఈదేశాన్ని పరిపాలించలేదు కదా. హిందువుల జీవితాలు ఎం దుకు మారలేదు. ప్రపంచ మానవాభివృద్ది సూచీలో మనదేశం 107స్థానంలో ఎందుకుంది? ప్రపంచ ఆకలిసూచిలో132 స్థానానికి ఎందుకు దిగజారాం? మన దేశం జీడీపీ 8.1 నుండి 5.4శాతానికి ఎందుకు పడిపోయింది? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు హిందువులకు ఎందుకివ్వలేదు? ఇటీవల ఆగస్టు1న అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ చేసుకునే అవ కాశం రాష్ట్రాలకు కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత అట్టడుగు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాలలంతా మనువాదు లేనని ఒకరు, మాదిగలంతా మనువాదులని వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను ఒక కులం నాయకుడిగా ,ఈ తీర్పు తర్వాత మాల నాయకుడిగా మారుస్తున్నారు. అంబేద్కర్‌ మాల కాదు, జగ్జీవన్‌ రామ్‌ మాదిగ కాదు ఒక రాష్ట్రంలో బీసీలో ఉన్న ఒక కులం మరో రాష్ట్రంలో ఎస్సీగా ఉంటుంది. దేశంలో 1500 ఎస్సీ కులాల్లో అంబేద్కర్‌ పుట్టిన మహార్‌ కులం కూడా ఒక షెడ్యూల్డ్‌ కులంఅంతేగాని, ఇక్కడ ఉన్న మాల కులం అక్కడి మహార్‌ కులం ఒకటి కాదు. మహార్‌, మాల వేర్వేరు. చమర్‌లు అందరూ మాదిగలు కాదు. సమగర మోచి కులం కూడా చెప్పులు కుట్టే వృత్తిలో ఉంది. అందుకని మోచి, మాదిగ ఒకటి కాదు. కులం అంటే మనువాద కులవ్యవస్థలో వియ్యం పొత్తు..కంచం పొత్తు ఉంటేనే ఒక కులంగా పరిగణిస్తుంది. దేశంలో అట్టడుగు వర్గాల విచ్ఛిన్నం మనువాదమైతే ఐక్యత విచ్ఛిన్నమవుతుంది. ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయమే అంబేడ్కర్‌ వాదం. అసమానతలే మనువాదం. మనుస్కృతి సృష్టించిన ఈ అసమానతలను ఐక్యంగా ఎదుర్కొని ఆ మధ్యయుగాల కాలం నాటి దుష్టత్వాన్ని సమూలంగా సమాధి చేయాల్సిన అవసరం ఉన్నది.
మాల మాదిగలు సంపన్నులు కారు.నూటికి తొంభై శాతం మంది రెక్కలే ఆస్తులుగా కలిగి ఉన్న నిరుపేదలు. ఒకరిద్దరు సంపన్నులు ఉన్నమాట నిజమే, కానీ అత్యధికులు నేటికి దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారే. తెలంగాణ రాష్ట్రంలో 59 ఎస్సీ కులాల్లో మాల మాదిగ మినహాయిస్తే మిగిలిన 57 కులాలు నేటికి అక్షర జ్ఞానానికి నోచని దుస్థితిలో సంచార జీవనం సాగిస్తున్నారు.సభ్య సమాజంతో సంబంధం లేకుండా ఉన్నారు. వారి చదువు,ఉపాధి,నివాసం వైద్యం వాళ్ల జీవన విధానం నేటికీ అగమ్యగోచరమే.
ఎస్సీ వర్గీకరణ ఒక్కటే సర్వరోగ నివారిణి కాదు. ఆయినంతమాత్రాన అందరికి సమన్యాయం, సామాజిక న్యాయం జరిగి తీరాలి. దేశప్రజలందరి గుండెకాయగా ఉన్న భారత రాజ్యాంగం రద్దు చేస్తే దేశం తిరిగి మధ్యయుగాల్లోకి వెళుతుంది. రాజ్యాంగ రక్షణ ఐక్య కర్తవ్యం కావాలి ప్రభుత్వరంగం లేకుండా రిజర్వేషన్లు ఉండవు. సామాజిక న్యాయం సమాధి అవుతుంది. నూటికి 80శాతంగా పెరిగిన ప్రయివేట రంగంలో రిజర్వేషన్లకోసం ఐక్యంగా పోరాడాలి. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేయాలి. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి తూట్లు పొడుస్తూ, బడ్జెట్‌ తగ్గిస్తూ దళితుల నోటికాడి బుక్క లాగేస్తున్న బీజేపీ విధానాలపై పోరాడాలి.బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ తాత్సారం చేయడాన్ని ప్రశ్నించాలి.దేశవ్యాప్తంగా దళితులను టార్గెట్‌గా చేసుకొని మతోన్మాదులు సాగిస్తున్న దౌర్జన్యాలను ప్రతిఘటిం చాలి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై పెరుగు తున్న దాడుల్ని ఐక్యంగా ఎదుర్కోవాలి. యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల్లో దళితులు అభద్రతలో ఉన్నారు. ఆ దౌర్జన్యాలపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలి.
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జీవిత లక్ష్యం కులనిర్మూలన, అసమానతలు లేని భారతం. కానీ ఆయన లక్ష్యాలు అధ్యయనం చేయకుండా అంబేడ్కరిస్టులు కాలేరు. భూమి జాతీయకరణ జరగాలని, పరిశ్రమల్లో కార్మికులకు కూడా యాజమాన్య వాటా ఉండాలని, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆయన హిందూ కోడ్‌ బిల్లు తెచ్చి నాటి ప్రభుత్వాలు అంగీకరించకపోతే కేంద్ర క్యాబి నెట్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1948లోనే కార్మికులకు కనీస వేతనచట్టం తీసుకొచ్చారు. అందుకే అట్టడుగు ప్రజల ఐక్యతలోనే అంబేద్కర్‌ ఉంటాడు. సమన్యాయం కోసం సమన్వయంతోనే అంబేద్కర్‌ లక్ష్యాలు సాధిస్తామన్న విషయం గమనించాలి.
కేంద్ర బీజేపీ పాలకులు మతం కేంద్రంగా పరిపాలన చేస్తూ రాజ్యాంగం మౌలిక పునాదుల్ని తుంచే కుట్రలో నిమగమై ఉన్నారు. ఈ నేపథ్యంలో అట్టడుగు వర్గాల ఐక్యత సమన్వయం సామాజిక న్యాయం వైపుగా అడుగులు వేయాలి. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అస్పృ‌శ్యుల ఐక్యతకు జీవితాన్ని ధారపోశాడు. అట్టడుగు కులాల్లో అనైక్యతను సృష్టించే మనువాద ఎజెండా మన తరగతుల్లో విస్తృ‌తంగా అమలవుతున్నది. అంబేద్కర్‌, పూలే, మార్క్స్‌ ఆలోచనలు ఆశయాలు నేటితరం ఆకలింపు చేసుకొని ముందుకు సాగాలి. అట్టడుగు వర్గాల్లో ఐక్యతను సాధించకుండా రాజ్యాంగ లక్ష్యాలను రక్షించుకోలేము. సామా జిక న్యాయాన్ని సాధించుకోలేము. వర్గీకరణ అంశంపై మాల, మాదిగ మేధావులతో సంఘీభావ కమిటీ ఏర్పడాలి. శాంతి చర్చలు, సమన్యాయం జరగాలి. విద్వేషాలు రెచ్చగొట్టడం మనువాద సంస్కృతి, విశాలత ఐక్యత అంబేద్కర్‌ సంస్కృతి. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 68వర్ధంతి సందర్భంగా దళితుల్లో ఐక్యతను సాధించడమే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.
– టి.సైలాబ్‌ బాబు, 9177549646