ఎరేజర్‌

పుట్టినప్పుటి నుంచి
వెంటాడుతున్న పుట్టుమచ్చలు
నన్ను సర్టిఫికెట్‌ చేస్తూ
ఎక్కడకు పోయిన అడుగుతున్నవి
మరల మరల
ఒకే ప్రశ్న… ఒకే తీరు

రెండో తరగతిలో
మూడో ఎక్కం దిద్దుతున్నపుడు
తప్పులను సరిచేసిన
లెక్కల టీచర్‌
ఇవాళ ఎదురొచ్చి
కన్నీళ్ళ కారణాలను
చెరిపేస్తే బాగుండు.

బతుకు పేజీలలో
రాసుకున్న ఇంకు మరకలు
గీసుకున్న అడ్డుగీతలు
ఒంటరిగా కూర్చోబెట్టి
నిన్నటి చేతల్ని నిలదీస్తుంటే
ఆ చేతుల్ని పట్టుకొని
ఏడ్వాలనుంది.

చూపుల్ని, వినికిడిని దాటిపోతూ
ఎన్నో వేల మాటల్ని దిగమింగిన
ఈ కాలంతో అలవాటుగానే
బానిసత్వం బహుమతిగా వచ్చింది.

కొంత దూరం నడిచాక
ఇంకెంతో దూరం ఉందని
పాదాలకు గుర్తు చేసే,
తప్పటడుగులను చెరిపేసే
ఎరేజర్‌ లాంటి మనసులు కావాలి.
మాసిన బతుకును చెరిపేసే
మసుషులు కావాలి.

– రామ్‌ పెరుమాండ్ల
89542265831