– భద్రాద్రి ఆలయ కమిటీ చైర్మెన్ పదవికి పోటా పోటీ
– రామారావు పేరు దాదాపు ఖరారు..!
– చివరి నిమిషంలో డిప్యూటీ సీఎం సతీమణి ఆసక్తి
– రాష్ట్రవ్యాప్తంగా ఆలయ కమిటీ పదవుల భర్తీకి సన్నాహాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేవాదాయ శాఖలోని ఆలయాలకు పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా పలు ఆలయ కమిటీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 546 కమిటీలు ఉండగా దేవాదాయ శాఖ కమిషనర్ పరిధిలోని 340 ఆలయ కమిటీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 76 ఆలయ కమిటీలు ఉండగా దీనిలో 16 కమిటీలకు గత నెల నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆలయాలు నాలుగు యాజమా న్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, పాల్వంచలోని పెద్దమ్మ గుడి (శ్రీ కనకదుర్గ), ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఈ ఆలయాలకు చైర్మెన్‌తో పాటు 14 మంది చొప్పున పాలక వర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. వీటిలో భద్రాచలం ఆలయ చైర్మెన్ పదవికి కీలక నేతలు పోటీ పడుతున్నారు.
మూడు ప్రధాన ఆలయాలకు తీవ్ర పోటీ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ప్రధాన ఆలయాల చైర్మెన్ పదవులతో పాటు పాలకవర్గంలో చోటు కోసం పలువురు తహతహలాడుతు న్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, పాల్వంచలోని పెద్దమ్మ గుడి (శ్రీ కనకదుర్గ), ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వర్వస్వామి ప్రధాన ఆలయాల పాలకవర్గం చైర్మెన్ లేదంటే కనీసం డైరెక్టర్ స్థానం దక్కించుకునేందుకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో 36, భద్రాద్రి జిల్లాలో 15 దేవాలయాలు కొనసాగుతున్నాయి. ఈ 51 ఆలయాల పాలకవర్గ పదవులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, ధార్మిక పరిషత్ పరిధిలో ఖమ్మం జిల్లాలో 12 ఆలయాలు, భద్రాద్రి జిల్లాలో మూడు ఆలయాల నిర్వహణ కొనసాగుతోంది. ఇక వరంగల్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో ఐదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో రెండు దేవాలయాలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 340 కమిటీలకు నోటిఫికేషన్!
ప్రభుత్వ పరిధిలో 56 కమిటీలు, ధార్మిక పరిషత్ (రెనోవేషన్ కమిటీ) పరిధిలో 118, కమిషనర్ పరిధిలో 372 కమిటీలు ఉండగా.. గవర్నమెంట్ పరిధిలోని 27 కమిటీలు, ధార్మిక పరిషత్ పరిధిలో 41, కమిషనర్ పరిధిలో 340 ఆలయ కమిటీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు స్టేలో ఉన్న 10 కమిటీలకు మినహాయింపు ఇచ్చింది. 81 కమిటీలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. అందులో గవర్నమెంట్ పరిధిలో 22 ఉండగా, ధార్మిక పరిషత్ పరిధిలో 59 ఉన్నాయి. కాగా, ఇప్పటికే 408 కమిటీలకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇవ్వడంతో సగానికి పైగా కమిటీలను నియమించినట్టు అవుతోంది.
ఎర్నేనికి ఖాయమనుకుంటున్న దశలో..
కమ్మ మహాజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు ఎర్నేని రామారావుకు భద్రాచలం దేవాలయ కమిటీ చైర్మెన్ పదవి దాదాపు ఖాయం అనుకుంటున్న దశలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఆ పదవిపై ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిన్న జీయర్‌స్వామి ఆశీస్సులు రామారావుకు మెండుగా ఉండటం కలిసి వచ్చే అంశం. ఆయన గతంలో పలు ధార్మిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. జీయర్ స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామారావుకు పదవి ఖాయం అనుకుంటున్న దశలో నందిని పోటీకి వచ్చారని సమాచారం. రామారావును డైరెక్టర్‌గా నియమించి తనకు చైర్మెన్ పదవి ఇవ్వాల్సిందిగా ఆమె కోరుతున్నట్టు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన దృష్ట్యా కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు నందినికి ఉండవచ్చనే టాక్ నడుస్తోంది. ఎర్నేనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో హిందూ మత ప్రచారకులు, ధార్మిక సంస్థల పెద్దలతో సత్సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.