ఎన్నికల విధులను సమన్వయంతో  నిర్వహించాలి : ఇ.ఆర్.ఒ రాంబాబు

నవతెలంగాణ-అశ్వారావుపేట : సార్వత్రిక ఎన్నికలు – 2023 లను పురస్కరించుకొని ఈ  నెల 09 న కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల సిబ్బంది సమన్వయంతో,అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అశ్వారావుపేట నియోజక వర్గం ఎన్నికల అధికారి,అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ ప్రాంగణంలో ఆయన అద్యక్షతన,నియోజక వర్గం ఎన్నికల నోడల్ అధికారి,పాల్వంచ డి.ఎస్.పి ఎన్.వెంకటేష్ ఆద్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని తహశీల్దార్లు,ఎం.పి.డి.ఓ లు, నోడల్ అధికారులు,సెక్టార్ అధికారులు,ఇ.ఎస్.టి,ఎస్.ఎస్.టి,వి.ఎస్.టి,ఎం.సి.సి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30 న జరుగుతున్న ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు గాను అధికారులను వారి యొక్క విధుల గురించి కూలంకుషంగా చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా  నియమావళి ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబందించిన బ్యానర్లు, పైక్సీలు,పోస్టర్లను తొలగించవలసినదిగా  ఆదేశించినారు.సెక్టార్ అధికారులను వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించవలసినదిగా కోరినారు.పోలీసు శాఖ వారికి ఆశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రా సరిహద్దులో వున్నది కాబట్టి చెక్ పోస్టులలో కట్టుదిట్టమైన తనిఖీలు చేయవలసినదిగా ఆదేశించినారు.అదేవిధంగా మిగిలిన అధికారులకు కూడా వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి ఎన్నికలు సజావుగా జరిగేలా తోడ్పాటు అందించ వలసినదిగా కోరారు.
ఏ వ్యక్తి అయినా రూ.50,000 (యాభై వేల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో ఎటువంటి ఆధారాలు లేకుండా వాహనాలలో తరలించినా లేదా కలిగి ఉన్నట్లయితే అట్టి నగదును జప్తు చేస్తారని ఇట్టి విషయంపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించ వలసినదిగా పోలీసు నోడల్ అధికారి ఎన్.వెంకటేష్ తెలిపారు. పోలీసు శాఖాధికారులు, రెవిన్యూ అధికారులు,ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియపరచనైనది.ఈ కార్యక్రమంలో నియోజవర్గం లోని తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఒ లు,నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు.ఎన్నికల విధులు నిర్వహించు బృందాలు పాల్గొన్నారు.